IAS Parikipandla Narahari | పాలకుర్తి : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సాహం అందిచ్చేందుకే తన తండ్రి పరికిపండ్ల సత్యనారాయణ స్మారక వాలీబాల్ పోటీ నిర్వహిస్తున్నామని బసంత నగర్ కు చెందిన ఐఏఎస్ పరికిపండ్ల నరహరి పేర్కొన్నారు. రెండో రోజు శుక్రవారం సాయంత్రం క్వార్టర్ ఫైనల్ పోటీలను ఆయన ప్రారంభించారు. మూడు రోజులపాటు క్రీడాకారులకు స్థానికంగా వసతి ఏర్పాటుచేసి, భోజన సౌకర్యాలు కల్పించి పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
నాలుగు జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొన్నాయి. శనివారం చివర రోజు సెమీఫైనల్, ఫైనల్ పోటీలు సాయంత్రం నిర్వహిస్తామన్నారు. తదనంతరం 12 మంది రాష్ట్రస్థాయి జానపద కళాకారులను గుర్తించి సన్మానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా సత్యనారాయణ స్మారకార్థం ప్రతి ఏటా ఇస్తున్నటువంటి సరస్వతీపుత్ర బహుమతిని సైతం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వాలీబాల్ పోటీలను మొదటిసారి నిర్వహిస్తున్నప్పటికీ ఆలయా ఫౌండేషన్ వాలంటీర్లు విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతీ ఏటా తన తండ్రి సత్యనారాయణ స్మరక వాలీబాల్ పోటీలు నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు.