కరీంనగర్, జూన్ 25 (నమస్తే తెలంగాణ)/ కార్పొరేషన్: కరీంనగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. స్మార్ట్ సిటీలో భాగంగా జిల్లా కేంద్రంలోని కూడళ్లలో ఏర్పా టు చేసిన సీసీటీవీల ద్వారా పర్యవేక్షించి, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు వాత పెట్టబోతున్నది. ట్రాఫిక్ సిగ్నల్స్ జంపిం గ్, హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగంగా వాహనాలు నడిపేవారికి ఆటోమెటిక్ జరిమానా విధించబోతున్నది. ఈ నెల 27 నుంచే అమల్లోకి తీసుక వస్తున్నట్లు తేబోతున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, వివరాలు వెల్లడించారు.
అతిక్రమిస్తే జరిమానా
స్మార్ట్‌సిటీ కింద నగరంలోని ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలను గుర్తించేందుకు 769 అత్యాధునిక కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం వెళ్లే వాహనాలను ఈ కెమెరాలు గుర్తించి, ఫోటోలు తీస్తాయి. ఈ చిత్రాల ఆధారంగా నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా పడుతుంది.
నగర పౌరుల భద్రత కోసమే : సీపీ
నగర పౌరుల భద్రత కోసమే సీసీ టీవీల వ్యవస్థను ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రో ల్ సెంటర్‌ను బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి ఆయన సందర్శించారు. సీసీ టీవీల కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో వాటి కనెక్టివిటి, వాటి పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ నిర్వాహకులు నాగేశ్వరరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీసీటీవీల పనితీరును వివరించారు. సీపీ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కెమెరాలను ఈనెల 27 నుంచి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తున్నామని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారికి చలాన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ నగర ప్రజలు, వాహనదారులు ఇక నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్, ఖరీముల్లా ఖాన్, రమేశ్, వెంకటేష్, ఇతర అధికారులు ఉన్నారు.