KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 13 : రెవెన్యూ అధికారులు ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల స్థాయిలో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలు వెంటవెంటనే పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులు నిత్యం ఆదేశిస్తున్నా, వాటిని తోసిరాజంటూ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తమ సమస్యలపై ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే వ్యక్తిగతంగా సూచించినా, స్థానిక అధికారులు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. దీంతో విధిలేక కలెక్టర్ వద్దకొచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
అయినా పరిష్కార మార్గం లభించకపోతే, రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. తాజాగా శుక్రవారం కూడా ఇదే తరహా సమస్యపై మరో రెండు రైతు కుటుంబాలు కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై ఆందోళనకు దిగాయి. భూమి రిజిస్ట్రేషన్ చేయమంటే సెటిల్ చేసుకోమని ఒత్తిడి చేస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్న అధికారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలంటూ, ఆ కుటుంబాలు తమ భూమి పట్టా కాగితాలతో రోడ్డుపై బైఠాయించాయి. చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చిట్టెల మైసవ్వ, చిట్టెల రాములు అనే రైతులు కలెక్టర్ ఆదేశించినా న్యాయం జరగటం లేదని, ఇతరులకు విక్రయించిన తమ భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా తమను బెదిరిస్తూ, మానసికంగా వేధిస్తున్నాడని, కలెక్టరమ్మ.. మాకు న్యాయం చేయాలంటూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన ద్వారం ఎదుట ఆందోళనకు దిగారు. చిగురుమామిడి గ్రామంలోని తమ కుటుంబాలకు చెందిన 853 సర్వేనెంబర్లో రెండెకరాల ముప్పై ఏడు గుంటల భూమిని విక్రయించగా, ఈఏడాది మార్చి 28న స్లాట్ బుక్ చేయగా, ఈ భూమిపై ఫిర్యాదులు వచ్చాయంటూ రిజిస్ట్రేషన్ నిలిపేశాడని బాధితురాలి కుమారుడు చిట్టెల కిష్టయ్య తెలిపాడు.
దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఆదేశించారని, దీంతో ఏప్రిల్ 23న స్లాట్ బుక్ చేసుకొమ్మని చెప్పగా రిషెడ్యూల్ చేసుకున్నామని, మరునాడు కార్యాలయానికి వెళ్తే మాతంగి తిరుపతి అనే వ్యక్తి మీభూమిపై ఫిర్యాదు చేశాడు. రిజిస్ట్రేషన్ చేయం అంటూ మళ్ళీ పాతకథే చెప్పుకొచ్చాడని, కలెక్టర్ వద్దకెల్దామంటూ తమను కరీంనగర్ తీసుకొచ్చి తనొక్కడే లోనికి వెళ్ళి మేడం ఆపమన్నది అంటూ చెబుతున్నటు వాపోయాడు. నేను సెటిల్మెంట్ చేస్తే తప్ప మీకు భూమి రిజిస్ట్రేషన్ కాదు అంటూ ఖరాఖండిగా చెబుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజావాణిలో నాలుగుసార్లు కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తే తహసీల్దార్‌ను చివాట్లు పెట్టిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని, తననే మేడం తో తిట్టిపిస్తారా మీ సంగతి వహిస్తానంటూ, బెదిరిస్తున్నాడని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తన తల్లి రెండు కిడ్నీలు చెడిపోతే వైద్యచికిత్సల కోసం ఉన్న భూమి విక్రయించినట్లు, కొనుగోలు చేసిన రైతు పేర రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ తమను ముప్పుతిప్పలు పెడుతున్నాడంటూ బాధిత కుటుంబ సభ్యులు బావురుమన్నారు. కలెక్టరమ్మ కనికరించి మాకు న్యాయం చేస్తూ, సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వైద్యచికిత్స అందక తన తల్లికి ఏదైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాలని బాధిత కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.