prominent film stars | కోల్ సిటీ, సెప్టెంబర్ 20: గోదావరిఖనికి చెందిన యూట్యూబ్ స్టార్, సీనియర్ కళాకారుడు, సామాజిక కార్యకర్త వేముల అశోక్ ను ప్రతిష్టాత్మక గ్రేటర్ ఎక్స్ లెన్సీ- 2025 అవార్డు వరించింది. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ సినీ ప్రముఖులు, తారల చేతుల మీదుగా అశోక్ కు ఆవార్డు ప్రదానం చేశారు. ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో కళారంగాలలో విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న పలువురిని అవార్డుకు ఎంపిక చేసింది.
దీనిలో భాగంగా గోదావరిఖనికి చెందిన వేముల అశోక్ నటనా రంగంలో ఆసక్తితో ఇప్పటివరకు దాదాపు 80 వరకు సందేశాత్మక షార్ట్ ఫిలింలను తీశారు. వీటిలో ప్రజాదరణ పొందిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రైవేటు వీడియో ఆల్బమ్ లు కూడా చిత్రీకరించారు. బుల్లి తెరపై అశోక్ కళా ప్రతిభను గుర్తించిన ఎఫ్ టీపీఏ- ఇండియా శనివారం నాడు హైదరాబాద్ లో ని కంట్రీ క్లబ్ లో జరిగిన ఈవెంట్ లో గ్రేటర్ ఎక్స్ లెన్సీ అవార్డుతో సన్మానించింది.
ఎఫ్ టీ పీఏ ఇండియా ప్రతినిధులు చైతన్య జంగా, వీఎస్ వర్మ, కిరణ్ బేజాడీ, చంద్రశేఖర్‌తోపాటు ప్రముఖ సినీ తారలు అశోక్ ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని సందేశాత్మక చిత్రాలను నిర్మించాలని సూచించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ కళారంగంపై ఆసక్తితో షార్ట్ ఫిలింలు తీస్తున్నాననీ, కానీ, హైదరాబాద్ వేదికగా సినీ ప్రముఖుల సరసన అవార్డు తీసుకునే భాగ్యం కలుగుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. తన చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానులకు ఈ అవార్డును అంకితం చేస్తానని పేర్కొన్నారు. కాగా, గ్రేటర్ అవార్డుతో గోదావరిఖనికి పేరు తీసుకవచ్చిన అశోక ను స్థానిక కళాకారులు అభినందించి హర్షం వ్యక్తం చేశారు.