Development | పెద్దపల్లి, మే7: ప్రణాళికాయుతంగా పెద్దపల్లి పట్టణాభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మున్సిపల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. పట్టణంలో నిర్మించిన రెండు పడుకల గదుల ఇండ్లకు తాగునీరు, విద్యుత్ సరఫరా, సీవరేజి లైన్ తదతర మౌలిక వసతుల పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగు నీటి సరఫరా ప్రతీ ఇంటికి జరుగుతుందో లెదో పరిశీలించి 15 రోజులలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 20 నాటికి లబ్ధిదారులకు ఇండ్లు అందించేందుకు సన్నద్ధం కావాలన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే పదేండ్ల పట్టణ ప్రగతిని అంచనా వేస్తూ ప్రతి రోజు తాగునీటి సరఫరా చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులకు సూచించారు.
ఏడాదికి ఆస్తి పన్ను రూ. 6 కోట్లు వసూలు అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. పట్టణంలో ఎక్కడా కూడా అక్రమ లెఔట్ ఉండటానికి వీలు లేదని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ నుంచి తీసుకున్న అనుమతి కంటే అధికంగా ఫ్లోర్ నిర్మించే వారి పై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ షిప్టింగ్ పనులు పూర్తి చేయాలన్నారు .
మున్సిపల్, విద్యుత్, మిషన్ భగీరథ అధికారులతో పాటు ఇతర అధికారులు సమన్వయంతో పని చేసి పట్టణాన్ని అన్ని విదాలుగా అభివృద్ధి చేయలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, విద్యుత్ శాఖ పెద్దపల్లి డీఈ తిరుపతి, మున్సిపల్ ఏఈ సతీష్, టీపీఎస్ వినయ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.