Peddapally | పెద్దపల్లి, మే22: అకాల వర్షాలు అన్నదాతను కన్నీరు పెట్టిస్తాన్నాయి. ఆరుగాలం శ్రమించి పండించి పంటను అమ్ముకునే సమయంలో ఆకాల వర్షాలు అన్నదాతను ఆగమాగం చేస్తున్నాయి. ఉదయం ఆరబోసుడు.. సాయంత్రం కుప్ప నుర్చుడుకే ఖర్చులు తడిసి మోపడౌతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వారం రోజుల్లో మూడు, నాలుగు రోజుల వర్షాలు పడ్డాయని, తేమ శాతం ఎట్లా వస్తుందని రైతులు అవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లిలోని ఎల్లమ్మ గుడి సమీపంలోని ఖాళీ స్థలంలో కొంత మంది రైతులు వరి ధాన్యాన్ని ఆరబోశారు. గురువారం మధ్యాహ్నం పడిన వర్షానికి ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. వర్షంతో పాటు భారీ ఈదురు గాలి వీయటంతో ధాన్యం రాశిపై టార్ఫాలిన్ కవర్లు కప్పేందుకు రైతులు పాట్లు పడ్డారు.