మెట్పల్లి/ గంభీరావుపేట/ ముస్తాబాద్, ఏప్రిల్ 18: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం వడగండ్లతో కూడిన భారీ వాన పడింది. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో ప్రభావం చూపింది. ప్రధానంగా కోరుట్ల నియోజకవర్గం అతలాకుతలమైంది. సుమారు గంటపాటు ఈదురుగాలులుతో కూడిన పడిన వానకు మెట్పల్లి పట్టణంతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్పల్లి మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. మెట్పల్లి బస్టాండ్ చౌరస్తాలో ట్రాఫిక్ స్టాండ్ ప్రధాన రహదారిపై పడింది. పలు చోట్ల రోడ్లపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయ కలిగింది. గాలివానతో దాదాపుగా మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మెట్పల్లి మండలంలో భారీ చెట్లతోపాటు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వరి, నువ్వులు, సజ్జ పంటలు నేలవాలగా, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, పసుపు తడిసిపోయింది. వేంపేట, ఆత్మకూర్‌లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మెట్పల్లి పాత మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో భారీ వృక్షం విరిగిపడింది. కోరుట్లలో బలమైన ఈదురు గాలులతో పట్టణ శివారులోని మామిడి కాయలు నేలరాలాయి. కథలాపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు.
నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో సుమారు 250ఎకరాలల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. రాజుపేటలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిముద్దయింది. నర్మాలలో రోడ్డుకు ఇరువైపులా చెట్లు విరిగి పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ముస్తాబాద్ మండలం మోహినికుంట, మద్దికుంటలో వరి పంట, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
కథలాపూర్, ఏప్రిల్ 18: కథలాపూర్ పీహెచ్సీలో వ్యాక్సినేషన్ గది శుక్రవారం సాయంత్రం దగ్ధమైంది. అకాల వర్షంతో వీచిన బలమైన గాలులతో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో వ్యాక్సిన్ నిల్వలు ఉంచే గదిలోని నాలుగు ఫ్రిడ్జ్‌లు, రెండు ఇన్వేటర్లు కాలిపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 25లక్షల నష్టం జరిగినట్లు వైద్యాధికారి సింధూజ పేర్కొన్నారు. పీహెచ్సీలో ప్రమాదం జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు.