తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన కాంగ్రెస్, ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. నిజానికి గత జనవరిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారన్న ప్రచారం జరిగినా నేటి వరకు ఊసే లేదు. మరోవైపు మెగా డీఎస్సీ ఉంటుందా..? లేదా..? అన్నదానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్ల ప్రక్రియ సజావుగా పూర్తయితేనే ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశమున్నా.. ఈ ప్రక్రియపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఓవైపు టెట్ అర్హత సాధించిన టీచర్లు.. మరోవైపు నాన్ టెట్ ఉపాధ్యాయుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండగా, మెగా డీఎస్సీపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటి అంశాలను డీఎస్సీకి ముడిపెట్టకుండా నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్ నిరుద్యోగుల నుంచి వస్తున్నది.
కరీంనగర్, జూన్ 13 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) : ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల నేపథ్యంలో మరోసారి టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) విషయం తెరపైకి వస్తున్నది. 2010 డీఎస్సీకి ముందు నియామకమైన టీచర్లకు టెట్ అర్హతతో సంబంధం లేకుండా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియ నిర్వహించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ఈ విషయంలో టెట్ అర్హత సాధించిన ఉపాధ్యాయులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, వచ్చే నెలలో ఈ విషయం సుప్రీంకోర్టుకు ముందుకెళ్తున్నది. దీంతో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో..? అన్న ఉత్కంఠ నెలకొంది.
పాఠశాల విద్యారంగాన్ని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) పలు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. చాలా రాష్ర్టాల్లో వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు బీఈడీ, టీటీసీ వంటి కోర్సులు పెట్టి సర్టిఫికెట్లు ఇస్తున్నాయని, వాటి ద్వారా నియమితులైన మెజార్టీ ఉపాధ్యాయుల్లో బోధనకు కావాల్సిన సామర్థ్యం, ప్రతిభ, పరిణితి ఉండడం లేదని భావిం చి 2010లో టెట్ ఉత్తీర్ణతను తెరపైకి తెచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలన్నా, ఉద్యోగం వచ్చిన తర్వాత పదోన్నతి పొందాలన్నా టెట్‌లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. ఆ మేరకు అప్పుడే నిబంధనలను నిర్దేశించింది. ఈ అర్హత సాధించేందుకు సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ముందుగా 2015 వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత మరో ఐదేళ్లు (2019 వరకు) పొడిగించింది.
ఆ మేరకు కొత్త నియామకాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ, ప్రమోషన్లకు మాత్రం ఇన్నాళ్లుగా అమలు చేయలేదు. అయితే ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత సాధించిన వారికే ప్రమోషన్లు ఇవ్వాలని పలువురు టీచర్లు కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించడంతో అసలు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆ మేరకు పదోన్నతి కోసం టెట్‌లో పాస్ అయిన వారు సీనియారిటీ జాబితా సమర్పించాలని గతేడాది సెప్టెంబర్ 27న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అప్పుడు ప్రమోషన్లకు బ్రేక్ పడింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న నాటి కేసీఆర్ సర్కారు.. ఇప్పటికిప్పుడు టెట్ నిర్వహించడం సాధ్యం కాదని, ఈ సారి పాత నిబంధనల ప్రకారమే పదోన్నతులకు అవకాశం ఇవ్వాలని, అలాగే టీచర్లకు టెట్ నిర్వహించేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరుతూ ఎన్‌సీటీఈకి లిఖిత పూర్వకంగా లేఖ రాసింది. అయితే ఎన్సీటీఈ మాత్రం ఆ లేఖను అంగీకరించకుండా.. కచ్చితంగా టెట్ అర్హత ఉన్నవారికే ప్రమోషన్లు ఇవ్వాలని అప్పట్లో స్పష్టం చేసింది.
ఓవైపు హైకోర్టు ఆదేశించడం, మరోవైపు ఎన్సీటీఈ అంగీకరించక పోవడంతో టెట్ అర్హత తప్పనిసరిగా మారింది. అయితే నాన్టెట్ ఉపాధ్యాయులు సైతం ఇదే విషయంలో కోర్టును ఆశ్రయించారు. అయితే 2010 డీఎస్సీ నాటికి నియామకమైన టీచర్లకు టెట్ అర్హతతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. ప్రస్తుతం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ఇక్కడ స్పష్టత రావాల్సింది ఉన్నది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు మాత్రమే పదోన్నతులకు చాన్స్ ఇవ్వాలని కోర్టు తీర్పు నిచ్చిందని, కానీ, ప్రభుత్వం అందరికీ అవకాశం కల్పిస్తున్నదని, దీనిపై తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని టెట్ ఉపాధ్యాయ అసోసియేషన్ చెబుతున్నది.
నిజానికి కేసీఆర్ ప్రభుత్వం గతేడాది ఆగస్టు వరకు ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించింది. అందులో భాగంగా డీఎస్సీ నిర్వహించేందుకు రాష్ట్రంలో 5,089 పోస్టుల భర్తీకి అప్పట్లో నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడు స్కూల్ అసిస్టెంట్లు 1,739, బాషా పండిట్లు 611, వ్యాయామ ఉపాధ్యాయులు 164, సెకండరీ గ్రేడ్ టీచర్స్ 2,575 పోస్టులు ఖాళీలుగా ఉన్నట్టు పేర్కొన్నది. ఉమ్మడి జిల్లాలో చూస్తే.. డీఎస్సీలో భాగంగా మొత్తం 393 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో స్కూల్ అసిస్టెంట్లు 125, ఎస్జీటీలు 176, భాషా పండితులు 72, పీఈటీలు 20 మొత్తం 393 పోస్టులు ఉన్నట్టు చెప్పింది. అందులో అన్నీ కలిపి కరీంనగర్ జిల్లాలో 99, అలాగే జగిత్యాల జిల్లాలో 148, పెద్దపల్లి జిల్లా 43, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 103 పోస్టులను చూపింది. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో డీఎస్సీ నిలిచిపోయింది.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఇది జరగాలంటే ప్రమోషన్ల ప్రక్రియ సజావుగా పూర్తి కావాలి. అది పూర్తయితేనే ఖాళీల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఉద్యోగోన్నతుల ప్రక్రియపై కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నది. నిజానికి టెట్ అర్హత లేకుండా నిర్వహిస్తున్న ఈ ప్రమోషన్ల ప్రక్రియ శాశ్వతంగా నిలిచే అవకాశం ఉంటుందా..? లేదా..? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం నిజంగానే మెగా డీఎస్సీ నిర్వహించాలని భావిస్తే పదోన్నతులతో లింకు పెట్టకుండా నేరుగా నోటిఫికేషన్ జారీ చేయవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విద్యాశాఖ లెక్కల ప్రకారం చూస్తే.. రాష్ట్రంలో ఈ యేడాది 3,800 మంది టీచర్లు ఉద్యోగ విరమణ చేయనున్నారు. వాస్తవానికి వారందరూ 2021లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చారు. మార్చి నెలాఖరు నుంచి ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. ఇది రాష్ర్టానికి సంబంధించిన అంశం అయితే.. ఉమ్మడి జిల్లాలో చూస్తే 1,384 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో 414, జగిత్యాలలో 504, పెద్దపల్లిలో 192, సిరిసిల్లలో 274 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 393 పోస్టులకు ఇవి అదనం కానున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 1,777 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రమోషన్లతో సంబంధం లేకుండా.. ప్రస్తుతం క్లియర్‌గా ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందని వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ కోసం కుస్తీ పడుతున్నారు. ఈ కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక వేళ టెట్, నాన్ టెట్ ఉపాధ్యాయుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఏదేని కారణాలతో ప్రమోషన్లు నిలిచిపోయినా.. దానిని సాకుగా చూపి మోగా డీఎస్సీ నోటిఫికేషన్ ఆపివేసినా నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.