ఉక్రెయిన్ సరిహద్దులు మూసివేత.. నిలిచిన రాకపోకలు
బంకుల్లో తలదాచుకుంటున్న తెలుగు విద్యార్థులు
అక్కడ టెన్షన్.. టెన్షన్‌గా మెడికోలు
ఇక్కడ ఆందోళనలో తల్లిదండ్రులు
విద్యార్థులను రప్పించేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు
ప్రత్యేక విమానాలు వేయాలని కేంద్ర మంత్రిని కోరిన మంత్రి కేటీఆర్
చార్జీలు తామే భరిస్తామని వెల్లడి
కరీంనగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ఉక్రెయిన్‌లో రష్యా భీకర యుద్ధంతో అక్కడున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు క్షణ క్షణం భయం భయంగా గడుపుతున్నారు. దాడుల నుంచి తప్పించుకునేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియక కొందరు ఉన్నచోటనే బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. కొందరు ఉక్రెయిన్ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తున్నా.. బార్డర్ మూసి వేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అక్కడ భయాందోళన వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ తల్లిదండ్రులు టెన్షన్‌కు లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో రప్పించేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తుండగా, చిక్కుకున్న వారిని తీసుకవచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అందుకయ్యే ఖర్చులను పూర్తిగా తమ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. మరోవైపు విద్యార్థుల కోసం హైదరాబాద్, ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లను ప్రారంభించారు.
ఉక్రెయన్లో యుద్ధ వాతావరణంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టెన్షన్ నెలకొంది. ఇక్కడి నుంచి ఎక్కువ మంది మెడిసిన్ కోసం ఆ దేశం వెళ్తుండగా, ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళన వారి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నది. గురువారం ఉదయం నుంచి అక్కడి ప్రధాన నగరాలపై రష్యా బాంబులు కురిపిస్తుండడంతో అక్కడ చిక్కుకున్న మెడికోలు భయం భయంగా గడుపుతున్నారు. శుక్రవారం అక్కడి మెడికోలతో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడే ప్రయత్నం చేయగా, కొందరు భయంతో నిరాకరించారు. మరికొందరు అక్కడ నెలకొన్న పరిణామాలను వివరించారు. విన్నీస మెడికల్ కళాశాలలో చదువుతున్న శిరీష, రవిచంద్రికతోపాటు పలువురు మెడికోలు మాట్లాడారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదని, భయానక పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. అక్కడి ప్రభుత్వం సైరన్ మోగిస్తున్నప్పుడల్లా బంకర్లలోకి వెళ్లాలని తమ మెడికల్ యూనివర్సిటీ డీన్ మెస్సేజ్ పెడుతున్నారని, అప్పుడు తామంతా వెంటనే బంకర్లలోకి వెళ్తున్నామని చెబుతున్నారు.
గురువారం రాత్రి అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో ఎవరం కూడా నిద్ర పోలేదని తెలిపారు. శుక్రవారం ఉదయం తమకు 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీపై రష్యా బాంబులు వేసిందని, దీంతో రేడియేషన్ ఫాం అవుతుందని అందరూ మాస్కులు పెట్టుకోవాలని, బంకర్లలోకి వెళ్లాలని చెప్పడంతో అందరం భయపడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఉండే హాస్టల్ గది ఏడు అంతస్తుల్లో ఉంటుందని, సైరన్ మోగిన వెంటనే అందరం ఒకే సారి కిందికి పరుగులు తీస్తున్నామని, బంకర్లలో దాక్కుంటున్నామని చెప్పారు. పొద్దటి నుంచి కనీసం తిండి కూడా సరిగ్గా తినలేదని వాపోయారు. ఇక ఖర్కివ్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులను బంకర్ల నుంచి బయటికి వెళ్లనీయడం లేదని తెలుస్తున్నదని విన్నీస మెడికల్ కళాశాలకు చెందిన మెడికోలు చెబుతున్నారు. ఈ యూనివర్సిటీ చుట్టూ బాంబులు పడుతున్నాయని వాట్సాప్ గ్రూపుల్లో మేసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు.
సర్కారు భరోసా..
ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు వాళ్లను సురక్షితంగా భారత్‌కు చేర్చడానికి సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీ రామారావు శుక్రవారం ట్విట్టర్ ద్వారా కేంద్ర మంత్రి జయశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఖర్చు మొత్తం తమ ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా విద్యార్థులకు భారత్‌కు రప్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బాధిత విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తీసుకు వస్తామని భరోసా కల్పిస్తున్నారు. భయపడొద్దని, పిల్లలను తీసుకొచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తున్నదని చెబుతున్నారు.
అక్కడ భయంతో గడుపుతున్న మెడికోలు ఇండి యాకు తిరిగి రావడానికి తీవ్రప్రయత్నాలు చేస్తు న్నారు. ఇండియన్ ఎంబసీ విజ్ఞప్తి మేరకు ఉక్రె యిన్ సరిహద్దుల వరకు విద్యార్థులను పంపించా లని శుక్రవారం కొన్ని మెడికల్ యూనివర్సిటీలను అక్కడి ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తున్నది. అయితే, విన్నీస మెడికల్ యూనివర్సిటీకి చెందిన ఫస్ట్ ఇయర్, సెకండియర్ విద్యార్థులు సుమారు 700 మంది శుక్రవారం మధ్యాహ్నం విన్నీస రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి 950 కిలో మీటర్ల దూరంలో ఉన్న హంగేరి దేశానికి వస్తే తాము రిసీవ్ చేసుకుంటామని అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు విన్సీస రైల్వే స్టేషన్‌కు వెళ్లిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. అక్కడ ఒక్క రైలు కూడా అందుబాటులో లేదని మెడికోలు చెప్పారు.
ఇక్కడికి ఎందుకు రమ్మన్నారని అక్కడి అధికారిని ప్రశ్నించగా, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, నేరుగా హంగేరి వెళ్లేందుకు కనెక్టివ్ ట్రైన్ తప్ప నేరుగా లేవని చెప్పినట్లు మెడికోలు తెలిపారు. దీంతో కొంత దూరం వెళ్లాక ట్రైన్స్ అందుబా టులో లేకుంటే అక్కడే ఇరుక్కు పోతామని భయ పడి తిరిగి మెడికల్ కాలేజీ హాస్టళ్లకు చేరుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రొమానియా, పోలాండ్, క్లోవ్ దేశాల సరిహద్దులు కూడా మూసి వేశారని, ఎక్కడికీ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం తమ యూనివర్సిటీ ముందు బాంబు పెట్టేందుకు ప్రయత్నించిన ఒక రష్యన్ వ్యక్తిని ఉక్రెయిన్ పోలీసులు అదుపులోకి తీసుకు న్నారని, విన్నీస యూనివర్సిటీకి చెందిన విద్యా ర్థులు ఆందోళన చెందుతున్నారు.