కరీంనగర్ కార్పొరేషన్, జూలై 30: కరీంనగరంలో అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ (యూడీఎఫ్) కింద మంజూరైన రూ.180 కోట్లతో చేపట్టాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ)పనుల టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని, టెండర్లలో పగిడీలు, కోట్లాది రూపాయల కమీషన్లు పంచుకునేందుకే కాంట్రాక్టర్‌కు అధిక రేట్లకు పనులు అప్పగించారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆరోపించారు. టెండర్లలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని, మొదటిసారి పిలిచిన టెండర్లోనే సుమారు 5 శాతం అధికంగా టెండర్ వేసి కాంట్రాక్టర్‌కు పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం రేవంత్‌రెడ్డి, స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండిసంజయ్ కుమ్మక్కై టెండర్లను అధిక రేట్లకు అప్పగించారని విమర్శించారు.
కరీంనగర్‌లోని ప్రైవేట్ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్‌సిటీ పనుల్లో తప్పనిసరిగా అండర్ గ్రౌండ్ పైపులకు లింక్ కలిపి ఇన్స్పెక్షన్ ఛాంబర్లు నిర్మించాల్సి ఉన్నా, ఎక్కడా ఒక్కటి కూడా కట్టిన దాఖలాలే లేవని మండిపడ్డారు. స్మార్ట్‌సిటీ పనులు ఎలా చేపట్టారో..? ఎన్ని ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయో..? అందరికీ తెలుసునని, సదరు కాంట్రాక్టర్ వ్యవహరంపై గతంలో బండి సంజయ్ అనేక ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే కాంట్రాక్టర్‌కు పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు.
మొదటిసారి పిలిచిన టెండర్లల్లో 5 శాతం ఎక్కువకు టెండర్ అప్పగించారంటే ఈ వ్యవహరంలో రూ.30కోట్ల నుంచి రూ.40 కోట్ల మేర డబ్బులు చేతులు మారాయన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. టెండర్లలో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొన్నారని, అధికంగా బిడ్స్ వేశారని, ఇందులో పోటీ ఉంటే 15 శాతం తక్కువకుపోయి చాలా లాభం జరిగేదన్నారు. నిజంగా ఈ వ్యవహరంలో బండి సంజయ్‌కి, సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధం లేకపోతే టెండర్లను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్‌సిటీ పనులను సరిగ్గా చేయని కాంట్రాక్టర్‌కు మళ్లీ ఇప్పుడు పనులు అప్పగిస్తే కరీంనగర్ మరింత ఆగమవుతుందని చెప్పారు. టెండర్లు తిరిగి నిర్వహించకపోతే కోర్టును ఆశ్రయించేందుకు ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ కాల్వ మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు పెండ్యాల మహేశ్, రాములు, మైకెల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.