Two minors Arrested | ధర్మపురి, సెప్టెంబర్ 1 : దొంగతనం కేసులో ఇద్దరు నిందితులను ధర్మపురి పోలీసులు అరెస్టు చేసి దాదాపు రూ.22 లక్షల విలువ గలిగిన సాత్తును స్వాధీనం చేసుకున్నారు. ధర్మపురి పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ వివరాలను వెల్లడించారు. డీఎస్పీ వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన బట్టల దుకాణం నిర్వాహకుడు కోలేటి మల్లికార్జున్ అనే వ్యాపారి తన భార్యపిల్లలు ఓ శుభకార్యానికి వెళ్లారు. కాగా ఆయన ఆగస్టు 30న ఉదయం 10గంటలకు ఇంటికి తాళం వేసి రోజూలాగే షాప్ కు వెళ్లాడు. సాయంత్రం షాప్ నుండి ఇంటికి చేరేసరికి తాళం పగులగొట్టి ఉంది.
కంగారుగా లోనికి వెళ్లి చూసేసరికి బీరువా తాళం కూడా పగలగొట్టి బట్టలు చిందరవందరగా పడిఉన్నాయి. బీరువా లోపల పరిశీలించగా బీరువాలో ఉంచిన 22.71 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించబడినట్లు గుర్తించి లబోదిబోమంటూ బంధువులకు తెలిపారు. బంధువుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ ఉదయ్ కుమార్, పోలీసులు మల్లికార్జున్ ఇంటికి చేరి పరిసరాలను పరిశీలించారు. పరిసర ప్రాంతవాసులతో మాట్లాడి ఆరా తీశారు. కాలనీలోని సీసీ పుటేజీలను పరిశీలించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఉదయ్ కుమార్ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ ఆదేశాలతో డీఎస్పీ రఘుచందర్ సూచనలతో ధర్మపుర సీఐ రాం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి సీసీటీవీల ఆధారంగా దొంగతనానికి పాల్పడ్డది ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. ధర్మపురికి చెందిన అన్నదమ్ములైన ఇద్దరు మైనర్లను వారి ఇంటివద్ద సోమవారం అదుపులోకి తీసుకొని విచారించారు.
వారివద్ద నుండి 22,71తులాల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకొని నిందితులు మైనర్లైనందున జగిత్యాల జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఎదుట హాజరుపరిచారు. కాగా చోరీకాబడిన సొత్తు విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.22 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వివరించారు. కాగా కేసును అతితక్కువ సమయంలో చేదించిన డీఎస్పీ రఘుచందర్, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్ఐ లు ఉదయ్ కుమార్, రవీందర్, కానిస్టేబుళ్లు రమేష్ నాయక్, రణధీర్, ఎం రమేశ్, రామస్వామి, ఇతర సిబ్బందిని ఎస్పీ ఆశోక్ కుమార్ అభినందించారు.