ధర్మారం, డిసెంబర్ 28 : స్నేహితుడి కొడుకును చూసేందుకు వెళ్లి వస్తూ ఆ ఇద్దరు స్నేహితులు అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరారు. ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతారనేలోపే రోడ్డుపై ఆగి ఉన్న లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. తండ్రులను కోల్పోయి ఇంటికి పెద్దదిక్కుగా నిలిచిన ఆ ఇద్దరు చనిపోవడం బంజేరుపల్లి లంబాడితండా (బీ)లో విషాదం నింపింది. గర్భిణులైన ఇద్దరి భార్యలు రోదించిన తీరు తండావాసులను కలిచివేసింది. ధర్మారం ఎస్ఐ లక్ష్మణ్ వివరాల ప్రకారం.. బంజేరుపల్లి లండాడితండా (బీ)కు చెందిన బానోత్ సంతోష్ నాయక్ (25), నున్సావత్ రాజశేఖర్ (25) ఇద్దరు స్నేహితులు. అదే గ్రామానికి చెందిన మరో స్నేహితుడికి ధర్మారంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో కొడుకు పుట్టగా, చూసేందుకు ఇద్దరు కలిసి శుక్రవారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో బైక్‌పై వెళ్లారు.
తర్వాత ఇంటికి అవసరమైన సరుకులు కొనుక్కొని, రాత్రి 9.40 గంటలకు తమ తండాకు బయలు దేరారు. పెద్దతండా దాటారు. మరో ఐదు నిమిషాల్లో ఇండ్లకు చేరుకుంటారనేలోగానే.. కరీంనగర్ – రాయపట్నం రహదారిపై వడ్లలోడుతో ఆగి ఉన్న లారీని బైక్‌తో ఢీకొన్నారు. ఎలాంటి ప్రమాద సూచికలు లేకుండా నడిరోడ్డుపై ఆగి ఉన్న లారీని గమనించలేకపోయారు. వేగంగా వచ్చి ఆ వాహనం కింది భాగంలోకి దూసుకెళ్లారు. బైక్ నడుపుతున్న సంతోష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, రాజశేఖర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఇద్దరి మృతదేహాలను కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించారు. శనివారం ఎస్ఐ శివ పంచనామా నిర్వహించి, ప్రమాదానికి కారణాలు నమోదు చేసుకున్నారు. రాజశేఖర్ భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ మహమ్మద్ ఫారూఖ్ ఖాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇరు కుటుంబాల్లో విషాదం
సంతోష్ నాయక్, రాజశేఖర్ మంచి ఫ్రెండ్స్. సంతోష్ కూలి పని చేస్తున్నాడు. ఆయన తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. అతనికి భార్య ప్రత్యూష, రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం ప్రత్యూష ఏడు నెలల గర్భిణి. రాజశేఖర్ కరీంనగర్లో ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి కూడా మరణించాడు. తల్లి నీలమ్మ, భార్య సునీత, రెండేళ్ల కూతురు ఉన్నది. ప్రస్తుతం సునీత ఐదు నెలల గర్భిణి. ఆమె వేములవాడలోని గురుకులంలో ఔట్ సోర్సింగ్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తుండగా, అక్కడే కుటుంబంతో కలిసి ఉంటున్నది. శుక్రవారం భార్యాభర్తలు ఇద్దరు తండాకు వచ్చారు. సాయంత్రం సంతోష్, రాజశేఖర్ బయటికి వెళ్లి వస్తామని తమ ఇండ్లల్లో చెప్పి అనుకోనిరీతిలో చనిపోవడంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కులను కోల్పోయిన తమకు దిక్కెవరని గుండెలవిసేలా రోదిస్తున్నాయి.