Arrested | ఓదెల, ఏప్రిల్ 19: వ్యవసాయ మోటార్ల దొంగతనం చేస్తున్న ఓదెల గ్రామానికి చెందిన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయి కుమార్ లను పొత్కపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు పెద్దపల్లి డీసీపీ పుల్ల కరుణాకర్ తెలిపారు. పొత్కపల్లి పోలీసుస్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వివరాలు వెల్లడించారు.
డీసీపీ కథనం ప్రకారం.. ఓదెల గ్రామానికి చెందిన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయి కుమార్ ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో రెండు నెలలుగా జిల్లాలోని సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో లో రైతులకు బావులపై, వాగులపై, చెరువు లపై, వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, మోటార్ సర్వీస్ వైర్లను దొంగలించారు. కాగా వీరిపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా మండల పరిధిలో శానగొండ గ్రామం శివారు జమ్మికుంట వెళ్లే దారిలో పోత్కపల్లి ఎస్ఐ ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాలీ లో నిందితులైన సిరిగిరి ప్రసాద్, అంగిడి సాయికుమార్ అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించారు.
దీంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ట్రాలీని తనిఖీ చేయగా వ్యవసాయ మోటర్స్, కరెంట్ సర్వీస్ వైర్లు కనిపించాయి. వీటి విషయంపై పోలీసులు ఆరా తీయగా వ్యవహారం బయటపడింది. వీరి దగ్గర నుంచి 39 మోటార్స్, 750 మీటర్స్ సర్వీస్ వైర్, ట్రాలీ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం కలిపి రూ.10,67,500, ఆటో ట్రాలీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పొత్కపల్లి ఎస్సైదీకొండ రమేష్, ఏఎస్ఐ రత్నాకర్, హెడ్ కానిస్టేబుళ్లు కిషన్, ప్రవళిక, రాజేందర్, వెంకటేష్, రవి, రాజు, శివశంకర్, శంకర్, రామకృష్ణ, అశోక్, సతీష్, హరీష్, రజిత, ధనలక్ష్మి, తేజస్వినిని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, పెద్దపెల్లి ఏసిపి జీ కృష్ణ, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ సుబ్బారెడ్డిల అభినందించి రివార్డులు అందజేశారు.