అబార్షన్ల రాకెట్లో ఆ ఇద్దరు మహిళా డాక్టర్లే కీలకం!
జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యల రాకెట్ సంచలనం రేపుతున్నది. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. అబార్షన్లు చేయడంలో ఓ ఇద్దరు మహిళా డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది.
- కాసుల కక్కుర్తితో ఆడ శిశువులను కడుపులోనే కాలరాస్తున్న వైద్యులు
- మంచి కోసం వాడాల్సిన డ్రగ్స్ గర్భ విచ్ఛిత్తి కోసం వినియోగం
- తల్లిదండ్రులను ఒప్పించాల్సింది పోయి దందాకు ప్రోత్సాహం
- ఇప్పటికే దారుణంగా పడిపోతున్న ఆడపిల్లల నిష్పత్తి
- కూపీ లాగితే డొంకంతా కదిలే అవకాశం
- కఠిన చర్యలు తీసుకుంటేనే భ్రూణహత్యలకు అడ్డుకట్ట
జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యల రాకెట్ సంచలనం రేపుతున్నది. రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తున్నది. అబార్షన్లు చేయడంలో ఓ ఇద్దరు మహిళా డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. వీరు హుజూరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ దవాఖానల్లోనే పనిచేస్తున్నట్టు సమాచారం ఉండగా.. సదరు వైద్యులు ఏయేటికాయేడు దందాను పోటీపడి మరీ పెంచుతున్నారు. కాసుల కక్కుర్తితో రోజుకు నాలుగైదు అబార్షన్లు చేస్తూ.. ఏకంగా ఎనిమిది నెలల శిశువులను సైతం గర్భంలోనే చిదిమేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భ్రూణహత్యలను అడ్డుకోవాల్సిన ఆ మహిళా డాక్టర్లు.. ‘ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువు’ అన్న నానుడిని అక్షరాలా నిజం చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు, అవసరాలను బట్టి.. ఒక్కో అబార్షన్‌కు ఒక్కో రేటు కట్టి అందినకాడికి దండుకొని రూ.కోట్లకు పడగలెత్తుతున్నా వారిలో ఇంకా ధనదాహం ఆశలు పెరుగుతున్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం ఎందరినో బలిపశువులను చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆడపిల్లల నిష్పత్తి దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో ఈ తరహా ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే.. మున్ముందు మరింత ప్రమాదం పొంచి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జమ్మికుంట, హుజూరాబాద్ కేంద్రంగా సాగుతున్న భ్రూణహత్యల రాకెట్లో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తున్నది. ఈ దందా మూడు రాష్ర్టాలకు విస్తరించగా.. అబార్షన్లు చేయడంలో ఓ ఇద్దరు డాక్టర్లే కీలక భూమిక పోషిస్తున్నారు. సదరు వైద్యులు కొన్నేళ్లుగా ఈ దందాను నడుపుతున్నారు. వీరు హుజూరాబాద్ డివిజన్లోని ప్రభుత్వ దవాఖానాల్లోనే పనిచేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. అందులో ఒకరు అబార్షన్లు చేయడంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తూ ఇప్పటికే కోట్లకు పడగలెత్తగా.. మరో వైద్యురాలు ఆమెను చూసి కొన్నాళ్ల నుంచి పోటీ పడుతున్నట్టు తెలుస్తున్నది.
నిజానికి శిశువు గర్భంలో చనిపోయినప్పుడు, విచ్ఛిత్తి చేసి.. రక్తస్రావం అయ్యేలా చేసేందుకు కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. తల్లి ప్రాణానికి ముప్పు ఉందని భావించే తరుణంలో ఈ డ్రగ్స్‌ను వినియోగిస్తారని కరీంనగర్ జిలాకేంద్రానికి చెందిన ఓ ప్రముఖ గైనకాలజిస్ట్ తెలిపారు. అయితే, ఈ డ్రగ్స్‌ను అబార్షన్ల కోసం యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. వీటితోపాటు గర్భవిచ్ఛిత్తి తర్వాత నొప్పులు వంటివి రాకుండా సులువుగా రక్తస్రావం కావడానికి ఒక రకమైన లిక్విడ్‌ను వినియోగిస్తున్నట్టు హుస్నాబాద్ పోలీసుల నిఘాలో వెలుగు చూసింది. ఇది అత్యంత ప్రాణాంతకమని తెలుస్తున్నది. ఇలా సాగుతున్న అబార్షన్ల దందాలో సదరు మహిళా డాక్టర్లే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు చాలా మందికి తెలిసినా.. ఆ దిశగా నిఘా యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు.
ముఖ్యంగా వైద్యారోగ్యశాఖ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సదరు వైద్యురాళ్లకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అబార్షన్ కేసులను తీసుకొచ్చేందుకు ఏకంగా ఓ నెట్‌వర్క్‌నే మెయింటెన్ చేస్తున్నారంటే వాళ్ల వ్యవహారం ఎంతదూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, రోజురోజుకూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నట్టు తెలిసింది. వివిధ సమస్యలతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే వారిని గుర్తించి, వారికి తప్పుడు మాటలు చెప్పి అబార్షన్లు చేసి.. డబ్బులు దండిగా గుంజుతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి గర్భంలో ఆడపిల్ల అని తెలిసి ఎవరైనా అబార్షన్ కోసం వస్తే నచ్చజెప్పి, అవసరమైతే ఆమె తల్లిదండ్రులు, భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి, అబార్షన్ చేసుకోకుండా అడ్డుపడి ప్రాణం పోయాల్సిన సదరు డాక్టర్లే.. గర్భంలో ఆడపిల్ల ఉందని చెప్పి ఇష్టానుసారం అబార్షన్లు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా పర్యవేక్షణాలోపం వల్లే జరుగుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పడిపోతున్న బాలికల సంఖ్య
ఉమ్మడి జిల్లాలో తాజా గణాంకాల ప్రకారం చూస్తే 0-6 ఏళ్ల వయసున్న బాల బాలికలు 3,36,053 మంది కాగా, అందులో 1,73,647 మంది బాలురు, 1,62,406 మంది బాలికలు ఉన్నారు. బాలికలకన్నా.. బాలురు 11,241 మంది ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు 935 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అలాగే 3,36,053 మంది బాలబాలికల్లో గ్రామీణ ప్రాంతాల్లో 2,44,443 మంది ఉండగా.. అందులో బాలురు 1,26,222 మంది, బాలికలు 1,18,221 మంది ఉన్నారు. అంటే ప్రతి వెయ్యి మంది బాలురకు 936 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అలాగే, అర్బన్ ప్రాంతాల్లో మొత్తం 91,610 మంది ఉండగా.. అందులో 47,425 మంది బాలురు, 44,185 మంది బాలికలున్నారు. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు 932 మంది బాలికలున్నారు.
ఇక కరీంనగరంలోకి వస్తే 0-6 వయసున్న చిన్నారుల సంఖ్య 29,560 ఉండగా, అందులో బాలురు 15,238 మంది, బాలికలు 14,322 మంది ఉన్నారు. ఇక్కడ ప్రతి వెయ్యి మందికి 939 మంది బాలికలున్నారు. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇక్కడ మొత్తం 19,037 మంది బాలబాలికలుండగా, అందులో 10,031 మంది బాలురు, 9,006 మంది బాలికలున్నారు. ఇక్కడ ప్రతి వెయ్యి మంది బాలురకు 897 మంది బాలికలే ఉన్నారు. ఇదే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉన్నది. నిజానికి ఏయేటికాయేడు భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి. పుట్టేది ఆడబిడ్డ అని తెలియగానే.. గర్భంలోనే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నారు. దీనికి కాసులకు కక్కుర్తిపడే కొంత మంది వైద్యులు సహకరిస్తున్నారు. ఫలితంగా స్త్రీ జాతి తన అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చిపెడుతున్నది. ఈ పరిస్థితుల్లో అబార్షన్ల పేరిట ఆడశిశులను చిదిమేసేందుకు సహకరిస్తున్న వైద్యులు, దవాఖాన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ దందాకు అడ్డుకట్టపడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

