వేములవాడ, జూన్ 10: దేవాదాయ శాఖలో ఉద్యోగుల బదిలీల వ్యవహారం ఉతంఠ రేపుతున్నది. గత నెల 21న నిర్వహించిన సమావేశంలో ఆలయాల్లో తిష్ట వేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కోడ్ ముగియగానే బదిలీలు ఉంటాయని పరోక్షంగా ఉద్యోగులకు సంకేతాలు కూడా అందాయి.
ఇప్పటికే ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను కూడా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత ఆలయాల నుంచి సేకరించారు. అయితే, బదిలీల ప్రక్రియపై రాష్ట్రంలో నిషేధం ఉండగా దానిని ఎత్తివేసి బదిలీలు చేపడతారన్న సమాచారం ఇటు రాజన్న ఆలయ ఉద్యోగుల్లోనూ ఆందోళన రేకెత్తిస్తున్నది. మరోవైపు బదిలీలు ఆపాలని నాయకులు, ఎమ్మెల్యేల చుట్టూ దేవాదాయ శాఖ ఉద్యోగులు ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ బదిలీలు దాదాపు అయిపోయినట్టుగానే తెలుస్తున్నది.
భద్రాద్రి రాముడి కల్యాణం అమెరికాలో నిర్వహిస్తుండగా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఈ నెల 14 తర్వాత కమిషనర్ హైదరాబాద్ కు రానుండగా, ఆ వెంటనే బదిలీలు జరుగుతాయని ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే సేకరించిన వివరాల ఆధారంగా రా ష్ట్రంలోని వేములవాడ, యాదాద్రి, భద్రాచలం, కొండగట్టు, కొమరవెల్లి, బాసర ఆలయాల ఉద్యోగుల బదిలీలు జరిగే అవకాశమున్నది.
ఆరోపణలు, అవినీతి మరకలు అంటుకున్న ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటివి ఉన్న కొండగట్టు, కొమురవెల్లి, బాసర ఆలయాల ఏఈవోలను ఇప్పటికే బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో తీవ్ర ఆరోపణలు ఉన్న వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని తెలుస్తున్నది. రాజన్న ఆలయంలోనూ విజిలెన్స్ నివేదికలు ఆధారంగా ఇటీవలే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆరోపణలు ఎదురొంటున్న ఉద్యోగులను గుర్తించి బదిలీల్లో తగిన చర్యలు తీసుకోనుండగా, ఆందోళన కనిపిస్తున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల ఉద్యోగుల బదిలీల వ్యవహారం తెరమీదికి రావడంతో స్థానిక ఎమ్మెల్యేలు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎలాగైనా తమ బదిలీలను ఆపాలని స్థానిక నేతలపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలుస్తున్నది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆగమనం తర్వాత బదిలీల వ్యవహారం తెరమీదికి రానుండగా, ఏళ్ల తరబడి తిష్ట వేసిన ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన మరింత ఉతంఠ రేపుతున్నది.