కరీంనగర్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఆర్థిక స్థోమత లేని నిరుపేద అభ్యర్థులకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ దిక్సూచిగా నిలుస్తున్నది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల సాధించుకునే లక్ష్యంతో నిరుపేద అభ్యర్థులు ఈ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ పొందుతున్నారు. కొలువుల కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పిస్తూ ఉచిత భోజనం, టీ, స్నాక్స్ కూడా అందిస్తున్నారు. ఉచిత స్టడీ హాల్‌ను కూడా ఏర్పాటు చేశారు. 2009లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన నిరుపేద అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. ఈ స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది ఇప్పటికే 138 మంది అభ్యర్థులు వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందారు.
26 ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సివిల్ సర్వీస్, రైల్వే రిక్రూట్మెంట్, బ్యాంకింగ్, పోస్టల్ ఉద్యోగాలకు, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే గ్రూప్-1, 2, 3, 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ అధికారులు, ఉపాధ్యాయ పోస్టులు, ఎక్సైజ్ కానిస్టేబుల్, గురుకుల టీచర్స్ తదితర పోస్టులకు సంబంధించిన పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు 26 రకాల ఫౌండేషన్ కోర్సులను ఎంపిక చేసి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 51 బ్యాచ్‌ల్లో శిక్షణ పొందిన 138 మంది నిరుపేద అభ్యర్థులు వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాకు చెందిన 108 మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్లో మంచి సదుపాయాలు, మంచి ఫ్యాకల్టీ ఉన్న విషయం తెలుసుకున్న అభ్యర్థులు ప్రవేశానికి పోటీ పడుతున్నారు.
నిరుపేద అభ్యర్థులకు వరం..
రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాల భర్తీకి క్రమంగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత శిక్షణ కోసం కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద అభ్యర్థులు వేలకు వేలు వెచ్చించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ పొందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక వర్గాల వారీగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇస్తోంది. అందులో భాగంగా 2009లో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల అభ్యర్థులకు కరీంనగర్లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. బీసీ సంక్షేమ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ చొరవతో మానేరు తీరాన అన్ని సదుపాయాలతో ఒక మంచి భవనాన్ని కూడా నిర్మించారు. అంతేకాకుండా వివిధ సబ్జెక్టుల్లో కెరీర్ గైడెన్స్ అనుభవం ఉండి, నిపుణులైన అధ్యాపకులతో అత్యున్నతస్థాయి శిక్షణను అందిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విధానంలో కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నారు. 75 శాతం బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ప్రాధాన్యతమిస్తున్నారు. 16 శాతం ఎస్సీ, 6 శాతం ఎస్టీ వర్గాల, 3 శాతం దివ్యాంగులు, అనాథ నిరుద్యోగ అభ్యర్థులకు, అన్ని కేటగిరీల్లో మహిళల 33 శాతం సీట్లు కేటాయించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా టీ, స్నాక్తోపాటు మధ్యాహ్నం భోజనం కూడా అందిస్తున్నారు. శిక్షణ సమయంలో రూ.5 వేల విలువ చేసే స్టడీ మెటీరియల్, నెలకు రూ.వెయ్యి చొప్పున ఉపకార వేతనం అందిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ప్రతి రోజూ తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక నమూనా పరీక్ష, వారానికి ఒక సారి గ్రాండ్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తూ, పోటీ పరీక్ష తీరు తెన్నులను వివరిస్తున్నారు.
ప్రైవేట్‌లో కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు
నేను ఇద్దరు పిల్లలను వదిలి వచ్చి గ్రూపు-2 కోసం ప్రిపేరవుతున్నా. ఇంట్లో ఉండి చదవలేక పోతున్నా. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టే పరిస్థితిలో లేం. అందుకే పిల్లలను వదిలి ప్రతి రోజూ ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటున్న. నిత్యం మాక్ టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నయ్. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్‌గా క్లాసులకు అటెండ్ అవుతున్న. కోచింగ్‌తోపాటు సదుపాయాలు చాలా బాగున్నాయి. వాతావరణం బాగుంటే మంచి ప్రిపరేషన్ జరుగుతుంది. ఇక్కడ అదే జరుగుతోంది. నాకైతే ఈ స్టడీ సర్కిల్ చాలా బాగా నచ్చింది.
– ఎన్ స్వప్న, వావిలాలపల్లి (కరీంనగర్)
మా ఫ్రెండ్ సలహాతో ఇక్కడికి వచ్చా
బీసీ స్టడీ సర్కిల్ ఇక్కడ ఉన్నదనే విషయం నాకు తెలియదు. మా ఫ్రెండ్ ఇక్కడ కోచింగ్ తీసుకుని చాలా బాగుందని చెప్పింది. వెంటనే ఇక్కడ జాయిన్ అయ్యా. అనుకున్నట్లే మంచి స్టడీ ఇస్తున్నారు. డైరెక్టర్ సార్ చాలా కేర్ తీసుకుంటున్నరు. ప్రతి రోజూ టెస్టులు పెట్టి ఏ రోజు కారోజే కీ ఇస్తున్నారు. దీని ద్వారా మరింత పట్టుదలతో ప్రిపేరవుతున్నం. మాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తున్నరు. ప్రైవేట్‌లో కోచింగ్ తీసుకునేందుకు నా వద్ద డబ్బుల్లేవు. ఎలా చదవడం అని ఆలోచిస్తున్న తరుణంలో మా ఫ్రెండ్ ఇచ్చిన సలహా నాకు ఎంతో మేలు చేసింది. పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలనుకుంటున్న. ఇలాంటి అవకాశం ప్రతి నిరుపేదలకు లభించాలని కోరుకుంటున్న.
– గంగాధర రజిత, గంగాధర
ఫ్రీ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. నిపుణులైన అధ్యాపకులతో ఉద్యోగాల సాధనకు అవసరమైన శిక్షణ ఇప్పిస్తున్నాం. ప్రతి రోజూ నమూనా పరీక్ష, వారానికి ఒకసారి గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. దీనిని బట్టి అభ్యర్థులు తమలో ఉన్న లోపాలను గుర్తించి సరిచేసుకుని పోటీ పరీక్షలకు సంసిద్ధులయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న వారితో కేరీర్ గైడెన్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా స్టేట్ డైరెక్టర్ అలోక్ కుమార్ కూడా డిజిటల్ క్లాసుల ద్వారా అభ్యర్థులకు అనేక విషయాల్లో గైడ్ చేస్తున్నారు.
– డాక్టర్ మంతెన రవికుమార్, కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్
చాలా మంచి స్టడీ సర్కిల్..
బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ బాగుంది. నేను ఇంగ్ల్లిష్ మీడియం అయినా ఇక్కడి ఫ్యాకల్టీస్ తెలుగులో చెప్పే అంశాలు చాలా బాగా అర్థమవుతున్నాయి. ప్రతి రోజూ టెస్టులు పెడుతున్నారు. చాలా శ్రద్దగా చూసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో చాలా మంది కుక్కి కుక్కి ఉంటారు. ఇక్కడ మాత్రం సౌకర్యవంతంగా సదుపాయాలు ఉన్నాయి. ఫ్యాకల్టీస్ కూడా చాలా చక్కగా చెబుతున్నారు. నేను గ్రూప్-2 కోసం ప్రిపేరవుతున్న. ఇక్కడ శిక్షణ పొంది ఉద్యోగం కొడతాననే ఆత్మవిశ్వాసం కలుగుతోంది. పట్టుదలతో చదువుకుంటున్న..
– అడ్లగట్ట మనోజ్‌కుమార్, తొంబరావుపేట, మేడిపల్లి మండలం (జగిత్యాల)
ప్రభుత్వానికి ధన్యవాదాలు..
కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్స్ కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ప్రతి రోజూ క్లాసులు జరుగుతున్నాయి. మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం గ్రాండ్ టెస్టు నిర్వహిస్తున్నారు. వీటితో మాలో ఎక్కడ లోపాలున్నాయో తెలిసి పోతోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులకు మధ్యాహ్నం భోజనం సదుపాయం కూడా కల్పించారు. ఇక్కడే తిని రెండో సెషన్ క్లాసులు వింటున్నాం. మా డైరెక్టర్ చొరవ తీసుకుని భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అందరినీ మంచి డిసిప్లేన్లో ఉంచుతారు. నేను ప్రిపేరవుతున్న గ్రూప్-2 కోసం మంచి శిక్షణ పొందుతున్న. ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు..
– గాజుల అరుణ్, కాచాపూర్, శంకరపట్నం మండలం (కరీంనగర్)
ప్రైవేట్ కంటే చాలా బాగుంది
బీసీ స్టడీ సర్కిల్ సెంటర్లో పైన చదువుకునేందుకు స్టడీ రూం ఏర్పాటు చేశారు. ఎంతో బాగుంది. ఎనిమిది నెలల కింద గ్రూపు-2 కోసం నేను ప్రైవేట్‌లో కోచింగ్ తీసుకున్నా. అక్కడి కంటే ఇక్కడ చాలా బాగుంది. ప్రతి రోజూ టాపిక్ వైజ్ ఎగ్జాం కండక్ట్ చేస్తున్నారు. ఇది మాకు చాలా ఉపయోగంగా ఉన్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్లకుండా టీ, స్నాక్స్ కూడా ఇస్తున్నారు. ఎవరైనా క్లాసులు వినదలుచుకోకుంటే వెళ్లి చదువుకోవడానికి కూడా స్టడీ రూం ఉంది. అక్కడ కావాల్సినన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. బాగా చదువుకుంటున్నాం. కోచింగ్ బాగుందని మా ఫ్రెండ్స్‌ను కూడా తీసుకొని వస్తున్నా.
– వీ కవిత, నాగులమల్యాల (కొత్తపల్లి మండలం)