దైవదర్శనయాత్ర విషాదాంతమైంది. అనుకోని రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని బలి తీసుకున్నది. సంతోషంగా యాదగిరిగుట్ట, స్వర్ణగిరిలో దర్శనం చేసుకున్న తర్వాత తిరుగుప్రయాణం కాగా, మరోకొద్ది నిమిషాల్లో చేరుకుంటామనేలోగా మృత్యువు వెంటాడింది. శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ అన్న రాజు కుటుంబంలోని కొడుకు, కోడలు, మనుమరాలుతోపాటు అల్లుడు, ఇద్దరు మనుమలు అక్కడికక్కడే చనిపోగా.. కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో భార్యాభర్తలు, ముగ్గురు చిన్నారులు ఉండడం కలిచివేయగా, ఈ ఘటనతో కార్మికక్షేత్రం సిరిసిల్లలో విషాదచాయలు అలుముకున్నాయి.
రాజన్న సిరిసిల్ల మే 1 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ అన్న బొల్లి రాజు – భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు శివకుమార్, శిరీష్, కూతురు తేజశ్రీ ఉన్నారు. వీరు సర్దార్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాజు బీడీ కంపెనీ టేకేదార్‌గా పనిచేస్తున్నాడు. పిల్లలందరికీ వివాహాలు జరిపించాడు. వీరిలో పెద్దకొడుకు, కోడలు శివకుమార్ (40), లాస్య (35) దంపతులకు కూతురు రిషిక (8) హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటున్నారు. శివకుమార్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండగా, లాస్య సివిల్ సప్లయ్ శాఖలో ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తున్నారు. కాగా కూతురు కోడం తేజశ్రీ (36), అల్లుడు శ్రీనివాస్ (41) సిరిసిల్లలోనే ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కృష్ణచంద్ర (14), మాధవ్ (11) ఉన్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో హైదరాబాద్‌లో ఉంటున్న శివకుమార్ తన కుటుంబంతోపాటు తన చెల్లెలు కుటుంబం కలిసి దైవ దర్శనాలకు వెళ్లాలని అనుకున్నారు. సిరిసిల్లలో ఉన్న తన సోదరికి ఫోన్ చేసి రమ్మని చెప్పారు. దాంతో తేజశ్రీ, తన భర్త, ఇద్దరు పిల్లలు కలిసి గురువారం హైదరాబాద్ వెళ్లారు. వీరంతా కలిసి శుక్రవారం తెల్లవారుజామున కారులో యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి వెళ్లారు.
అక్కడ దైవదర్శనం చేసుకున్నారు. మధ్యాహ్న సమయంలో తిరుగు ప్రయాణం అయ్యారు. మరో కొద్ది నిముషాల్లో శంషాబాద్ అవుటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) దిగి సనత్‌నగర్ చేరుకోనుండగా, అంతలోనే ఘోరం జరిగిపోయింది. సాయంత్రం 4గంటల ప్రాంతంలో శంషాబాద్ ఓఆర్ఆర్పై 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనక నుంచి వీరి కారు వేగంగా ఢీకొన్నది. దీంతో ఆ కారు లారీలో ఇరుక్కొని నుజ్జునుజ్జయింది. అక్కడికక్కడే శివకుమార్, లాస్య, శ్రీనివాస్, ముగ్గురు చిన్నారులు రిషిక, కృష్ణచంద్ర, మాధవ్ మృత్యువాత పడ్డారు. తేజశ్రీ చావు బతుకుల్లో ఉండగా, హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కేటీఆర్ ఆదేశాల మేరకు కిమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు అక్కడి వైద్యులు తెలిపారు. మృతి విషయం తెలియడంతో బొల్లి రామ్మోహన్‌తోపాటు రాజు కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తరలివెళ్లారు. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ దార్ల సందీప్ సంతాపం తెలిపారు.
రోడ్డు ప్రమాదంతో బొల్లి రాజు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. కొడుకు, కోడలు, అల్లుడు, వారి ఇద్దరు పిల్లలు మృత్యువాత పడడం, కూతురు తీవ్రంగా గాయపడడంతో కొండంత దుఃఖం మిగిలింది. దైవ దర్శనాలకు వెళ్లొస్తామని చెప్పి కానరాని లోకాలకు పోయారంటూ రాజుతోపాటు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంత పనాయె దేవుడా అంటూ విలపిస్తున్నారు. ఇటు కోడం శ్రీనివాస్ మృతితో తల్లి లక్ష్మి గుండెలవిసేలా రోదిస్తున్నది. శ్రీనివాస్ వేములవాడలోని శ్రీరామ్ చిట్స్ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పదిహేనేళ్ల క్రితమే తండ్రిని కోల్పోయాడు. ముగ్గురు అక్కలు ఉండగా, అందరికీ వివాహాలు కూడా జరిపించాడు. ఏడాది క్రితమే ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం చేశాడు. ఇప్పుడు అనుకోని రీతిలో శ్రీనివాస్‌తోపాటు ఆయన ఇద్దరు కొడుకులు ప్రమాదంలో చనిపోయారు. ఆయన భార్య తేజశ్రీ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నది. విషయం తెలిసిన తల్లి, అక్కలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. తమకు ఏ దిక్కు లేకుండా పోయిందని విలపిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలిచి వేసిందని, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబీకులు ఆరుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని సానుభూతి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు సిరిసిల్ల వాసులు మృతి చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన ఆవేదనకు లోనయ్యారు. సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి, ధైర్యం చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంటనే తన కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని తన పీఏ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. అలాగే శంషాబాద్ ఏసీపీ నాగభూషణంతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో ఎకడా జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన మహిళకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించేలా దగ్గరుండి పర్యవేక్షించారు. ఆరుగురి మృతి తనను ఎంతగానో కలచివేసిందని, బాధిత కుటుంబాలకు పార్టీ పరంగా, వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో తోడుంటామని హామీ ఇచ్చారు.