కమాన్‌చౌరస్తా, జనవరి 14: చిక్కటి చలిని చీల్చుకుంటూ ఎగిసే భోగి మంటలు.. రంగవల్లులను సింగారించుకునే లోగిళ్లు.. గరక, పూలు, బొట్లతో కొలువుదీరే గొబ్బెమ్మలు.. అయ్యగారికి.. అమ్మగారికి దండం పెట్టే బసవన్నలు.. భోగిపండ్లు.. బొమ్మల కొలువులు.. కొత్త అల్లుళ్లు.. కొంటె మరదళ్లు.. పిండి వంటల ఘుమఘుమలు.. ఇలా ప్రతి ఇంటా సరదాలు పూయించే సంక్రాంతి సంబురాలు శనివారం నుంచి మొదలయ్యాయి. మొదటి రోజు భోగి వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరుపుకున్నారు. తెల్లవారు జామునే భోగి మంటలు వేశారు. అనంతరం పిల్లలకు తలస్నానం చేయించి, భోగిపండ్లను పోశారు. ఉదయాన మహిళలు వాకిళ్లను రంగు రంగుల ముగ్గులతో నింపి, వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచారు. వాటిపై గరక పోసలు ఉంచి, చుట్టూ నవధాన్యాలు, పండ్లు పోశారు. పెద్దపల్లి బల్దియా ఆధ్వర్యంలో స్థానిక జెండా చౌరస్తా వద్ద, సుల్తానాబాద్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. సకల సౌభాగ్యాలను తెచ్చే సంక్రాంతి పండుగను అంత ఒక్కచోట కలిసి జరుపుకోవడం సంతోషకరమన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయారంగానికి పెద్దపీట వేయడంతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని చెప్పారు. గోదావరిఖని పవర్‌హౌస్ కాలనీలో పవర్ ఉమెన్ కమిటీ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి ఆధ్వర్యంలో భోగి ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు.
నేడు మకర సంక్రాంతి
నేడు మకర సంక్రాంతి. సకల సౌభాగ్యాల పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. సూర్యుడు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు తిరుగుతాడు. దీనినే ఉత్తరాయణంగా చెబుతారు. ఇది మహా పుణ్యకాలం. ఏ శుభకార్యానికైనా మంచిదని హిందువులు నమ్ముతారు. అందుకే సంక్రాంతి మహత్తరమైన పండుగ అని పురాణాలు ప్రవచిస్తున్నాయి.
రైతన్నకు ప్రత్యేకం కనుమ
ఇక సంక్రాంతి తర్వాత రోజు జరుపుకునే పండుగ కనుమ. ‘కనుమ’ అంటే పశువు అని అర్థం. దుక్కి దున్నిన నాటి నుంచి పంట ధాన్యాన్ని గాదెలకు చేర్చేవరకు శ్రమించిన పశువులను ఆరాధించడమే కనుము పండుగలోని పరమార్థం. కనుమ రోజున పశువులను కడిగి పసుపు, కుంకుమతో కొమ్ములకు అలంకరించి ముఖానికి బొట్టు పెట్టి ఊరేగిస్తారు. అలాగే, కనుమ రోజు పితృదేవతలకు పూజలు చేస్తారు. సంక్రాంతి రోజు తమ ఇండ్లలో రైతులు పాలుపొంగించుకుంటారు. పాయసం చేసుకుంటారు. పశువులను పూజించే పండుగ అయిన కనుమను ఘనంగా జరుపుకుంటారు.