Government jobs | వీణవంక, జూలై 26 : ఒకే కుటుంబం నుండి ఉద్యోగాలు సాధించిన ఆ ముగ్గురిని యువత ఆదర్శంగా తీసుకోవాలని రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోతుల అజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ ఉద్యోగ నియామకాల్లో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగం సాధించగా అజయ్ పాటు అతని తల్లిదండ్రులను మాజీ సర్పంచ్ పోతుల నర్సయ్య శనివారం శాలువాకప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతుల చంద్రయ్య-ఇందిర దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారని, ఆ ముగ్గురిని చంద్రయ్య దంపతులు కూలీ పని చేస్తూ కష్టపడి చదివించారన్నారు. సంవత్సరం క్రితం శ్రావణ్ (సీఆర్పీఎఫ్), నవత (ఎక్సైజ్ కానిస్టేబుల్) ఉద్యోగాలు సాధించగా ఇప్పుడు వారి సోదరుడు అజయ్‌కుమార్ సీఆర్పీఎఫ్లో ఉద్యోగం సాధించడం హర్షించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య, నాయకులు ఎలుబాక రాజయ్య, సతీష్, కటుకోజుల సంపత్ తదితరులు పాల్గొన్నారు.