అప్పటిదాక హోలీ వేడుకలు జరుపుకొన్న ముగ్గురు బాలురు.. స్నానం చేయడానికి వాగులోకి వెళ్లి నీట మునిగి మృత్యువాత పడ్డారు. కరీంనగర్ శివారులోని మానేరు వాగులో మంగళవారం జరిగిన ఈ ఘటనతో ముగ్గురి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా నుంచి కూలీ పనికోసం వలస రాగా, పండుగపూట సంబురంగా ఆడుకున్న కొడుకులు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, తాను మరో రూ.2లక్షల చొప్పున అందజేస్తానని మంత్రి గంగుల హామీ ఇచ్చారు.
– రాంనగర్/తిమ్మాపూర్ రూరల్/ కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 7
రాంనగర్/తిమ్మాపూర్ రూరల్/ కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 7 : ఉదయం నుంచి హోలీ పండుగను తోటి స్నేహితులతో ఆనందంగా జరుపుకున్న విద్యార్థులు స్నానం కోసం వాగులోని ఓ గుంతలోకి దిగి మృత్యువాత పడ్డారు. కరీంనగర్ శివారులోని మానేరు వాగులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన బత్తిని వీరాంజనేయులు(16), గోనెపల్లి సంతోష్(13), వల్లెపు అనిల్(14) తల్లిదండ్రులు తాపీ మేస్త్రీలుగా పని చేసుకుంటూ హౌసింగ్‌బోర్డుకాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వీరాంజనేయులు 10వ తరగతి, సంతోష్, అనిల్ 8వతరగతి చదువుతున్నారు.
మంగళవా రం హోలీ పండుగ సందర్భంగా వేడుకలు జరుపుకున్న వీరు.. మధ్యా హ్నం సమయంలో అల్గునూర్ మానేరు బ్రిడ్జి, తీగల వంతెన మధ్యలో రివర్‌ఫ్రంట్ పనులు జరుగుతున్న స్థలంలో వాగులో స్నానం చేయడానికి దిగారు. దీంతో ఈత రాకపోవడంతో నీట మునిగి అక్కడికక్కడే మృతిచెందారు. అప్పటి వరకు వీరితో ఉన్న మరో స్నేహితుడికి వీరు కనిపించడకపోవడంతో నీటమునిగారని భయాందోళనతో వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటిన ఘటనా స్థలం వద్ద కు వచ్చేవరకే మృతిచెంది ఉన్నారు. బాలుర మృతదేహాల వద్ద కుటుంబసభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఏసీపీ తాండ్ర కరుణాకర్‌రావు, ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు చనిపోయారని కుటుంబసభ్యులు ఆందోళన చేయగా, పోలీసులు వారిని సద్దుమనిగించారు.
రూ.3 లక్షల చొప్పున పరిహారం
ముగ్గురు బాలుర మృతి విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.3 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించగా, బుధవారం మంత్రి గంగుల కమలాకర్ బాధిత కుటుంబాలకు చెకులు అందజేయనున్నారు. నగరంలో వలస కూలీలుగా జీవిస్తున్న ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన ముగ్గురు పిల్లలు వాగులో మృతి చెందడం తీవ్ర బాధాకరమని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు, అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. వారి కుటుంబాలకు తన తరఫున మరో రూ.2 లక్షలు అందజేస్తానని చెప్పారు.