కోరుట్ల, ఫిబ్రవరి 13: కోరుట్ల పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్లో(Korutla bus stand) గురువారం చోరీ జరిగింది. బాధితురాలి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వెలిచాల రుచిత మూడు రోజుల క్రితం కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామానికి తన తల్లి గారి ఇంటికి వచ్చింది. గురువారం అదిలాబాద్ వెళ్లే క్రమంలో కోరుట్లలోని కొత్త బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ఎక్కింది. తన బ్యాగులో పెట్టిన పర్సు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.
బస్సు ఎక్కే క్రమంలో రద్దీగా ఉండడంతో గుర్తుతెలియని వ్యక్తులు తన బ్యాగులోని పర్సును ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పర్సులో నాలుగు తులాల బంగారం, ఏడు వందల నగదు ఉన్నట్లు వాపోయింది. కాగా, దొంగతనం జరిగిన ప్రాంతాన్ని కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్ పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.