Veenavanka | వీణవంక, డిసెంబర్ 20 : సర్పంచ్‌గా పోటీ చేయమని, ఈటల ప్రచారాన్ని రద్దు చేసుకుంటే ఖర్చంతా తామే భరించి అన్ని విధాలా అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ నమ్మించి నట్టేట ముంచారని బీజేపీ సీనియర్ నాయకుడు, మండల ప్రధానకార్యదర్శి ఏలేటి శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని కనపర్తి గ్రామం నుండి బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తాను సర్పంచ్ పదవి కోసం పోటీ చేశానని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మండలాధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తమ గ్రామానికి ఈటల రాజేందర్ ప్రచారానికి వస్తే ఫలితం వేరేలా ఉండేదని, ఈటల రాజేందర్ ప్రచారానికి వస్తే పార్టీ నుండి ఎలాంటి సహకారం ఉండదని, ఈటల రాజేందర్ ప్రోగ్రాం రద్దు చేసుకుంటే ఖర్చు మొత్తం తామే భరిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనతో పాటు అనేక మంది బీజేపీ అభ్యర్థులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ గ్రూపు రాజకీయాలతో కొన్నేండ్లుగా బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి పని చేస్తున్న తనలాంటి వారికి తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. ఇలాంటి వారి నాయకత్వంలో పని చేయడం ఇష్టంలేక తన పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడి స్వంత గ్రామంలో దయనీయస్థితిలో..
జిల్లా బీజేపీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న గంగాడి కృష్ణరెడ్డి స్వగ్రామంలో పార్టీ పూర్తిగా దయనీయ స్థితిలో ఉండటం గమనార్హం. బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిది మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. ఈ గ్రామంలో ఈ నెల 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితం కావడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. గ్రామంలో మొత్తం 2226 ఓట్లు పోలుకాగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి జడల రమేష్ 896 ఓట్లతో విజయం సాధించగా, రెండో స్థానంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నిలువగా, కేవలం 22 ఓట్లు మాత్రమే బీజేపీ బలపరిచిన అభ్యర్థికి రావడం శోచనీయమని గ్రామంలో చర్చించుకుంటున్నారు.