Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 30: రామగుండం నగర పాలక పరిధిలో ఆశావహులకు ఈయేడు వినాయక చవితి కలిసి వచ్చింది. నిరుడు వినాయక చవితి అప్పుడు ఎక్కడ చందాలు అడుగుతారోనని తప్పించుకొని దూరం దూరంగా ఉన్న మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు, వివిధ పార్టీల నాయకులు ఇప్పుడేమో అంతా తమదే భారం అంటూ ఉత్సవ కమిటీలకు, యూత్ అసోసియేషన్ల దగ్గరకి వస్తున్నారు. ‘చందా ఇస్తా గానీ.. మీ యూత్ ఓట్లు మొత్తం నాకే పడాలి మరి’ అంటూ మాట తీసుకుంటున్నారు.
అలాగైతేనే మీ మండప ఏర్పాట్ల నుంచి మొదలు విగ్రహం కొనిచ్చేదాకా అంతా తానే భరిస్తానంటూ వాగ్ధానం చేస్తున్నారు. గత రెండు రోజులుగా రామగుండం కార్పొరేషన్లో ఆశావహులు వినాయక మండపాల చుట్టూ చక్కర్లు కొడుతూ ఉత్సవ నిర్వాహకులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొందరైతే స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రముఖులను మండపాల వద్దకు తీసుకవచ్చి వీరంతా మనవారే అంటూ పెత్తనం మీదేసుకుంటున్నారు. వినాయక మండపం ఏర్పాటుకు అనుమతుల నుంచి మొదలు వివిధ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు.
అంతేగాక ఆయా డివిజన్లలో మున్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వద్దకు వెళ్లి అక్కడ ఫొటోలు దిగుతూ డివిజన్ కు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ మన డివిజన్ కు ఈ పనులు మంజూరు చేయించాననీ, వినాయక మండపం కోసం మున్సిపల్, ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తున్నానని పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఆయా డివిజన్లలో సాధారణ పనుల్లో భాగంగా వర్షాకాలం ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నగర పాలక కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఆధ్వర్యంలో వీధి లైట్ల నిర్వహణ, డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. వీటినే ఆశావహులు ఆసరాగా చేసుకొంటున్నారు. ఇదిలా ఉంటే గణపతి చందాలు తానంటే తాను ఇస్తానంటూ ఆయా మండప నిర్వాహకులకు కబుర్లు పంపిస్తున్నారు.
ఉత్సవాల నిర్వహణకు ఎంత అంటే అంత ఖర్చు పెడుతానంటూ సందడి చేస్తున్నారు. ఆశావహుల హడావిడిని చూసి ఉత్సవ నిర్వాహకులు, భక్తులు విస్తుపోతున్నారు. డివిజన్ కోసం ఏనాడూ జేబులో నుంచి రూపాయి ఖర్చు పెట్టని వారు ఇప్పుడేంటి పిలవకపోయినా మండపం వద్దకు వచ్చి మరీ చందాలు రాయడం, ఇంకా తక్కిన ఏర్పాట్లకు పూచికత్తు ఇస్తున్నారేంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఈయేడు మాత్రం వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ భారం తప్పుతుందని ఉత్సవ నిర్వాహకులు ఊపిరి పీల్చుకొని కాస్త పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు.