Singareni | గోదావరిఖని : జీడీకే-1 గనిలో జరుగుతున్న అధికారుల అవినీతి అక్రమాలపై గుర్తింపు సంఘం నాయకుల చర్యలపై తాను ఫిర్యాదు చేసినందుకే తనపై కక్షగట్టి తనను బదిలీ చేయాలని ధర్నా చేశారని జీడికే గని ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ జనరల్ అసిస్టెంట్ ఉద్యోగురాలు జనగామ స్వప్న స్పష్టం చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
తాను పనిచేస్తున్న గనిలో అధికారుల అవినీతి అక్రమాలు గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకుల చర్యలపై తాను ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేసినందుకే తనపై కక్షగట్టి ఇక్కడి నుంచి పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారని వాపోయారు. తనకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పోస్టు లేదని తాను ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ చేయడం లేదని తెలిపారు.
ఈనెల 7న గనిలో మంటలు చిలరేగిన అంశంపై దానిని కప్పిపుచడానికి అధికారులు ఆదివారం కార్మికులకు ఇచ్చే 50 ప్లేడేలకు బదులుగా 100 ప్లే డేలు ఇచ్చారని, వీటిపై తాను ఫిర్యాదు చేస్తే తనపై కక్షగట్టి ఈ విధంగా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సేఫ్టీ ఆఫీసర్ ఇసుక కుంభకోణంలో ఉన్నారని, ధర్నా నిర్వహించిన హెడ్ ఓవర్ మెన్ వినయ్ ప్రైవేట్ దందాలు చేస్తున్నాడని తాను ఫిర్యాదు చేసినట్లు ఈ కారణంగానే ఆయన కార్మికులను పోగుచేసి తనపై దుష్ప్రచారం చేశాడని ఆమె ఆరోపించారు. గనిలో ఎవరికి లేని రూల్స్ మహిళా కార్మికురాలినైనా తనపై విధించడం ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని ఆమె వివరించారు.