నేటి ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. కార్పొరేట్ ఆఫీసుల నుంచి పారిశ్రామిక రంగాల వరకు ప్రతిచోటా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇటు ఇల్లు, అటు ఆఫీసు బాధ్యతలను సమన్వయం చేసుకునే ఈ పరుగు పందెంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదురొంటున్నారు. పని ఒత్తిడి, శారీరక మార్పులు, పని ప్రదేశాల్లోని వాతావరణం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మహిళా ఉద్యోగులు ఎదురొనే ప్రధాన సమస్యల్లో శారీరక రుగ్మతలు మొదటి వరుసలో ఉంటున్నాయి.
గంటల తరబడి ఒకేచోట కూర్చుని కంప్యూటర్ల ముందు పనిచేయడం వల్ల తీవ్రమైన నడుము నొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు, ఉదయం పూట కంగారుగా ఆఫీసులకు బయలుదేరడం వల్ల చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ దాటవేస్తుంటారు. సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తహీనత, విటమిన్ లోపాల వల్ల దీర్ఘకాలిక నీరసానికి గురవుతున్నారు. మరో ప్రధానమైన శారీరక సమస్య యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. పని ప్రదేశాల్లో శుభ్రమైన టాయిలెట్స్ లేకపోవడం వల్ల, పని ఒత్తిడిలో యూరిన్‌ని ఆపుకోవడం వల్ల మహిళలు ఈ సమస్యకు గురవుతున్నారు.
ఇది పరోక్షంగా కిడ్నీ రుగ్మతలకు కూడా దారితీస్తున్నది. కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా, మానసిక ఒత్తిడి కూడా మహిళలను తీవ్రంగా వేధిస్తున్నది. కెరీర్ డెడ్‌లైన్స్ అందుకోవడం, అదే సమయంలో కుటుంబ బాధ్యతలను నిర్వహించడం వల్ల వారు నిరంతరం తీవ్ర అలసటకు గురవుతున్నారు. ఈ మానసిక ఒత్తిడి నేరుగా వారి హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతున్నది. ఫలితంగా పీరియడ్స్ క్రమం తప్పడం, పీసీఓడీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ సమస్యలకు పరిష్కారంగా దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ప్రతి గంటకు ఒకసారి సీట్లోంచి లేచి ఐదు నిమిషాలు నడవడం లేదా చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలి, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. లంచ్‌బాక్స్‌లో ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు యోగా, ధ్యానం, వాకింగ్ కోసం కేటాయిస్తే ఒత్తిడి తగ్గి, హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. మహిళల ఆరోగ్యం వ్యక్తిగత అంశం కాదు, అది సమాజ ప్రగతితో ముడిపడి ఉంది. ఒక ఆరోగ్యకరమైన మహిళే ఉత్పాదకత కలిగిన ఉద్యోగినిగా, బాధ్యతగల గృహిణిగా రాణించగలదు. అలాగే, పని ప్రదేశాల్లో మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడం యాజమాన్యాల బాధ్యత కూడా!