వేములవాడ, జూలై 14: రాజన్న ఆలయ అర్చక బదిలీలకు బ్రేక్ పడనున్నది. ఈ మేరకు తనను కలిసిన అర్చకులకు వేములవాడ ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రెండు రోజుల క్రితం ‘నమస్తేతెలంగాణ’లో అనధికార అర్చక బదిలీలు శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆది శ్రీనివాస్ స్పందించారు. ఆదివారం రాజన్న ఆలయ అర్చకులు ఆది శ్రీనివాస్‌ను వేములవాడలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనం చేశారు.
అనంతరం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వివిధ ఆలయాల సాంప్రదాయాల ప్రకారం పూజా విధానాలు ఉంటాయని వివరించి బదిలీ నిర్ణయాన్ని వెనక్కుతీసుకునే లా చూడాలని విజ్ఞప్తిచేశారు. దీంతో ఆయన రాష్ట్రంలోని దేవాలయ పరిధిలో ఉన్న శాసనసభ్యులందరం కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
అర్చకుల బదిలీలు ఉండబోవని ఆయన హామీఇచ్చినట్లు వారు తెలిపారు. పరిపాలనపరమైన ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలసీల్లో భాగంగా 40 శాతం ఉద్యోగుల బదిలీ తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు. ఆయన్ను కలిసినవారిలో రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్ ఉన్నారు.