SIRICILLA | సిరిసిల్ల టౌన్, మే 5 : సన్న వడ్ల కొనుగోలుపై ప్రభుత్వం, అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. ఓ వైపు సన్న వడ్ల కొనుగోళ్లలో అనేక మెలికలు పెడుతన్నారని, మరో వైపు కొనుగోలు చేసిన వాటికి డబ్బులు చెల్లించడంలేదని ఆరోపించారు. బోనస్ చెల్లింపును ఎగవేసేందుకే ఇటువంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వడ్ల కొనుగోలు విషయంలో అనేక ఆందోళనలు చేసిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఇబ్బందులు వెడుతున్నారని పేర్కొన్నారు.
సన్న వడ్ల కొనుగోలులో విఫరీతమైన కొర్రీలు పెడుతూ రైతులకు సున్నం పెడుతున్నారని వాపోయారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ఏ గ్రామంలోనూ ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాలు నిండిపోవడంతో రైతులు పొలాల వద్ద ధాన్యం నిలువ చేసుకుని ఎదురు చూస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యానికి సంబందించిన డబ్బులు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అడ్డగోలు అవినీతి దందాలు చేసుకుంటూ రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందిని అడిగితే ప్రభుత్వం నుండి ధాన్యం కొనుగోలుపై ఎటువంటి ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారని తెలిపారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దాన్యానికి భద్రత లేకుండా పోయిందన్నారు. జిల్లాలో పాలనాధికారి లేడని, కాంగ్రెస్ పాలన నడుస్తుందన్నారు. ధాన్యం కొనుగోలుపై ఎవరిని అడగాలో తెలియడంలేదన్నారు. సన్నం వడ్లు కొనుగోలు చేయడంలేదని, కొనుగోలు చేసిన దొడ్డు వడ్లకు సంబంధించిన డబ్బులు చెల్లింపుపై స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుండి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉద్యమిస్తుందని ప్రకటించారు.
కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగిన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సన్న వడ్లు కొనుగోలు చేయకపోవడంతో 50 శాతం మంది రైతులు రైస్ మిల్లులకు విక్రయించారని అన్నారు. మిల్లర్లు ప్రభుత్వం తమను బ్యాంకు గ్యారెంటీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుందని చెబుతున్నారని తెలిపారు. వారం, పది రోజుల పాటు కొనుగోలు చేసిన ధాన్యం లారీలలో నిలిపి ఉంచుతున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వచ్చేవని తెలిపారు ఆకాల వర్షాలతో నష్టం జరిగితే రైతులకు నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకునేదన్నారు.
సన్న వడ్ల కొనుగోలు, బోనస్ చెల్లింపుతో పాటు కొనుగోలు చేసిన దాన్యానికి సంబంధించిన డబ్బుల చెల్లింపు ప్రక్రియ వెంటనే చేపట్టాలని, లేనిపక్షంలో రెండు రోజుల్లో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ గ్రామాలలో పోరాటం ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజి జడ్చి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, ఎండి. సత్తార్, గజభీంకార్ రాజన్న, వరుస కృష్ణహరి, గుండారపు కృష్ణారెడ్డి, వెంగళ శ్రీనివాస్, కుంబాల మల్లారెడ్డి, మాట్ల మధు, గుండు ప్రేమ్ కుమార్, ఇమ్మనేని అమర్నాథ్, బండి జగన్, ఒగ్గు బాలింగం, ప్రేమ కుమార్, తదితర నాయకులు పాల్గొన్నారు.