గంగాధర, జూలై 12 : అసలే వర్షాభావం.. ఆపై కరెంటు కోతలు.. ఈ రెండు సమస్యలను అధిగమించుకుంటూ పంటలను ఎలాగోలా దక్కించుకుంటూ సతమతమవుతున్న రైతన్నకు ఇప్పుడు తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండడం పుండుమీద కారంచల్లినట్టుగా మారింది. వరినార్లను కాపాడుకోవడానికి ఇప్పటికే నానా తంటాలు పడుతుండగా, విద్యుత్ శాఖ అధికారుల తీరు వారిని మరిన్ని కష్టాల్లోకి నెడుతున్నది. గంగాధర మండలంలోని వివిధ గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి 20 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పదేళ్లలో ఎట్ల నడిచినయని, ఇప్పుడెట్ల కాలిపోతున్నాయని ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ నాసిరకంగా మరమ్మతులు చేయడంతో ట్రాన్స్ఫార్మర్లు వెంట వెంటనే కాలిపోతున్నాయని, వారికి పైసలు కావాలె తప్ప రైతుల గోస పట్టదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గంగాధర మండలంలోని నాగిరెడ్డిపూర్, న్యాలకొండపల్లి, వెంకంపల్లి గ్రామాల్లో 20 రోజుల క్రితం నాలుగు 16కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. దీంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంకపల్లిలో ఇప్పటికే వరి నార్లు ముదిరిపోగా, పోసిన నారుమడులు కూడా ఎండిపోతున్నాయి. సమస్య ఇలాగే ఉంటే తీవ్ర నష్టం వచ్చే ప్రమాదమున్నది. నాగిరెడ్డిపూర్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ చేయకపోవడంతో నార్లు కూడా పోయలేని దుస్థితి ఉన్నది. న్యాలకొండన్నపల్లి పరిధిలో పంటలకు నీరందక ఇబ్బంది పడుతున్నారు. అయితే ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే అవి తరచూ కాలిపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. నెల రోజుల క్రితం బూరుగుపల్లిలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసి బిగిస్తే ఇప్పటికే మూడు సార్లు, వెంకంపల్లిలో 20 రోజుల్లోనే ట్రాన్స్ఫార్మర్ ఐదు సార్లు కాలిపోయిందని చెబుతున్నారు. తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండడంతో రవాణా, ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం, కాంట్రాక్టర్ నాసిరకం పనులతో తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
16 కేవీ ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో లేవు
ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులు ఇబ్బంది పడకుండా వెంటవెంటనే మరమ్మతులు చేయిస్తున్నాం. మూడు గ్రామాల్లో కాలిపోయినవి 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లే. ప్రస్తుతం 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో లేవు. దీంతో కొద్దిగా ఇబ్బంది అవుతున్నది. పై అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
– సత్యనారాయణ, ఏడీ
కరెంటు ఆఫీసు సుట్టూ తిరుగుడైతంది
ఈసారి వానల జాడలేదు. ఇప్పటికే ఎవుసం ఆల్చెమైది. బాయిల ఉన్న నీళ్లతోనన్న నార్లు పోద్దామని చూత్తె మా పొలం దగ్గర ఉన్న టాన్స్ఫారం 20 రోజుల కింద కాలిపోయింది. అప్పటి నుంచి కరెంటు ఆఫీసు సుట్టే తిరుగుడైతంది. కరెంటు లేకపోవుడుతోని నార్లు కూడా పొయ్యలేదు. ఎప్పుడూ గిన్ని రోజులు కాలే. ఏంజెయ్యాల్నో సమజైతలేదు. ఏటా నాకున్న మూడెకురాలల్ల వరి ఏసెటోన్ని.. ఈసారి ఇప్పటికి మూడు గుంటలు కూడా ఎయ్యలేదు. సార్లు జల్ది ట్రాన్స్ఫారం రిపేర్ చేయించాలె.
– ఎగర్లు కుంటయ్య, రైతు (నాగిరెడ్డిపూర్)
ఇరువై రోజులల్ల ఐదు సార్లు కాలిపోయింది
మా పొలం దగ్గర ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 20 రోజులు అయితున్నా సార్లు పట్టించుకుంటలేరు. వరి నార్లు ముదిరిపోతున్నయి. కాంట్రాక్టర్ తక్కువ రకం వైరు, వస్తువులు వాడుడుతోనే 20 రోజులల్ల మా దగ్గరి ట్రాన్స్ఫార్మర్ ఐదు సార్లు కాలిపోయింది. ఇట్ల తెచ్చిపెడుతరో లేదో అట్ల కాలిపోతున్నది. ఇన్నేండ్ల సుంది ఎట్ల నడిసినయి, రెండు నెల్ల సంది జెప్పజెప్పన ఎట్ల కాలిపోతున్నయో సార్లు చెప్పాలె. తక్కువ రకం సామన్లు వాడితే ట్రాన్స్ఫార్మర్ తొందరగా కాలిపోవా..? తిప్పలవెడితే రైతులు మళ్లీ తీసుకువస్తరు. మళ్లీ రిపేర్ చేస్తే పని దొరుకుతది.. పైసలు అత్తయని కాంట్రాక్టర్ ఇకమాత్ పడుతున్నడు. రానుపోను ఖర్చులు, ట్రాన్స్ఫార్మర్ ఎక్కిచ్చుడు, దించుడు ఖర్చులతోని మేం ఇబ్బంది పడుతున్నం. వీళ్లకు రైతుల గోస పట్టదు. పైసలు మాత్రం కావాలె.
– గొర్రె దేవయ్య, రైతు (వెంకంపల్లి)