Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 11: రామగుండం పద్మశాలీ సేవా సంఘంలో లెక్కల లొసుగులపై విభేదాలు పొడచూపుతున్నాయి . నూలు పౌర్ణమి పురస్కరించుకొని గోదావరిఖనిలో శనివారం నిర్వహించిన వేడుకలకు సంబంధించి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న కొందరు వసూళ్లు చేసిన విషయంలో ఒకరికొకరికి పడక బాహాటంగా వివాదస్పద విమర్శలు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా రామగుండం పద్మశాలీ సంఘంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. స్థానిక మార్కండేయ కాలనీలోని శివాలయం నుంచి మొదలైన ఈ వర్గ విభేదాలతో సంఘం పరువు తీస్తున్నారంటూ కులస్థులు వాపోతున్నారు.
ఒక వర్గంకు చెందిన కొంతమంది సంఘం సీనియర్ నాయకులు మార్కండేయ రథయాత్ర వేడుకలకు సంబంధించి లెక్కాపత్రం చూపకుండా సొంతానికి వాడుకున్నారని ఆ వర్గంకు చెందిన వ్యక్తుల మధ్య విభేదాలు పొడచూపి ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకోవడం సంఘంలో వాడివేడి చర్చ జరుగుతోంది. అధికార రాజకీయ పార్టీ నేతల దగ్గర కూడా మెప్పు పొందటానికి కుల సంఘంలో తమదే బలగం పెద్దదని ప్రచారం చేసుకుంటున్నారు. వీరి వ్యవహార శైలిని చూసి కులస్థులు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్న జరిగిన వేడుకలకు సంబంధించి వసూలు చేసిన మొత్తంలో చేతివాటం జరిగినట్లు ఒకరిపై ఒకరు బాహాటంగా ప్రచారం చేసుకోవడం వివాదస్పదమైంది.