ఎల్లారెడ్డిపేట, మే 20 : జీలుగ విత్తనాల పంపిణీలో ఆలస్యం జరుగుతున్నది. ఏప్రిల్లో అందించాల్సి ఉన్నా.. నేటికీ అరకొరే ఇస్తుండడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఎల్లారెడ్డిపేట మండలంలోని 24 గ్రామాలకు దాదాపు 1200 బ్యాగులు అవసరముండగా, మంగళవారం కేవలం 500 బ్యాగులే వచ్చాయి. నెలన్నర ఆలస్యమైనా అంతంతే వచ్చాయి. అందులో ఎల్లారెడ్డిపేటకు చెందిన వీవోకు 250, కోరుట్లపేట వీవోకు 250 చొప్పున అందించగా, మండల కేంద్రానికి రైతులు సంఖ్యలో తరలివవచ్చారు. గంటలపాటు బారులు తీరారు. గతంలో 1125 ఉన్న బ్యాగును సబ్సిడీ అని చెప్పి ఇప్పుడు 2136కు అమ్ముతున్న విషయం తెలుసుకుని ఆగ్రహించారు. తక్కువ బ్యాగులు రావడం, రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వారిని చూసి చాలా మంది వాపస్ వెళ్లిపోయారు. ఈ విషయమై వ్యవసాయాధికారులను సంప్రదించగా, ఇండెంట్ పెట్టామని రెండు, మూడు రోజుల్లో వస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరైన సమయంలో తక్కువ ధరకు తీసుకెళ్లిన రోజులను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదని, రైతులను గోసపెడుతున్నదని మండిపడ్డారు.
నేను పొద్దుగాల వచ్చిన. రెండు గంటల నుంచి నిల్చున్నా లైన్ రాలేదు. నాకు మూడెకరాల భూమి ఉన్నది. 2.5 ఎకరాలకు ఒక బ్యాగు ఇస్తున్నరు. సబ్సిడీ ధర అంటున్రు. కానీ, ఇంతకు ముందు 1125 ఉన్న ధర ఉంటే ఇప్పుడు 2136కు పెంచి అమ్ముతున్నరు. ఇగ ఇదేం సబ్సిడో ఏమో. వాళ్లకే తెల్వాలె. రైతులనైతే గోసవెడ్తున్నరు.
ఏప్రిల్ల రావాల్సిన జీలుగ విత్తనాలు పంపుడు ఈడికే లేటైందంటే.. మళ్లీ తక్కువ పంపిన్రు. విత్తనాల కోసం గింతగనం లైనుంటదా..? నాకు ఏడెకరాల భూమి ఉన్నది. మూడు బ్యాగులు కావాలె. మరి ఇస్తరో ఏమంటరో.. సెంటర్కు 250 వస్తే ఎక్కడ సరిపోతయ్. ఇవన్నీ అయిపోతె మల్ల ఎప్పుడస్తయో ఏమో. ఇవి ఇప్పుడు వేస్తే 45 రోజుల టైం తీసుకుంటది. వానకాలం పంట వేసేయాళ్లకు జీలుగ పెరగాలి. ఇది లేటయితే పంట లేటయితది. రైతుకు ఇబ్బందైతది.