Ramagundam Baldia | కోల్ సిటీ, జనవరి 1: రామగుండం నగర పాలక సంస్థ ముసాయిదా ఓటరు జాబితా సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జేఅరుణ శ్రీ పర్యవేక్షణలో గత మూడు రోజులుగా నగర పాలక కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, సహాయకులు సుమారు 80 మంది సిబ్బందితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రూపకల్పనకు ముమ్మరంగా కుస్తీ పడి పూర్తి చేశారు. నగర పాలక పరిధి 60 డివిజన్లలో మొత్తం లక్షా 82 వేల ఓటర్ల సంఖ్యతో జాబితా రూపకల్పన చేశారు.
గతంలో లక్షా 78 వేల ఓటర్ల సంఖ్య ఉండేది. డివిజన్ల పునర్విభజన అనంతరం మొత్తం 60 డివిజన్లుగా రూపాంతరం చెందగా, దాదాపు 10 వేల ఓటర్ల సంఖ్య పెరిగింది. మొత్తంగా లక్షా 82వేల ఓటర్ల సంఖ్యతో జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాలో ఏమైనా ఓటర్ల గల్లంతు జరిగితే దరఖాస్తుల స్వీకరణ అనంతరం స్వల్పంగా పెరిగే అవకాశముంది. ఈమేరకు గురువారం నగర పాలక కార్యాలయంలో ఇన్ఛార్జి కమిషనర్ అరుణ శ్రీ ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై జాబితాను ప్రదర్శిస్తున్నామని, జాబితాలో ప్రచురితమైన పేర్లు, చిరునామాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా నగర పాలక కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈనెల 5న నగర పాలక కార్యాలయంలో ఉదయం 11 గం.లకు ముసాయిదా ఓటరు జాబితాపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. కాగా, ఈనెల 10న తుది ఓటరు జాబితా ప్రకటించి అనంతరం డివిజన్ల వారీగా బీసీ కుల గణన చేపట్టనున్నారు. ఆ తర్వాతే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.