పేదల ఆకలి తీరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఇందిరమ్మ క్యాంటీన్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 159 అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో 50 కేంద్రాలకే పరిమితం చేసింది. మధ్యాహ్న భోజన సదుపాయంతో పాటు రూ.5 కే ఆరు రకాల బ్రేక్ ఫాస్ట్ అంటూ ప్రారంభోత్సవ సందర్భంగా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. పట్టుమని ఆరు నెలలు గడవక ముందే అల్పాహార మెనూలో కోత విధించింది. ఒప్పందం ప్రకారం పేదలకు పౌష్టికాహారం అందించేందుకు రోజుకో రకమైన మిల్లెట్ టిఫిన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అల్పాహారం అందిస్తున్న 50 కేంద్రాల్లో ఎకడా ఈ మెనూ పాటించడం లేదు. చాలా చోట్ల రోజువారీగా కేవలం ఉప్మా, పొంగల్ మాత్రమే పెడుతూ మమ అనిపిస్తున్నారు. కొత్తలో హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో రోజుకో రకం టిఫిన్ పెట్టేవారని, కానీ ఇప్పుడు ఏ క్యాంటీన్ చూసినా ఉప్మా, పొంగలితోనే సరిపెడుతున్నారని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 159 ఇందిరమ్మ క్యాంటీన్లు ఉండగా, బ్రేక్ ఫాస్ట్ మాత్రం కేవలం 50 కేంద్రాలకే జీహెచ్ఎంసీలో 29, ఎంఎంసీలో 13, సీఎంసీలో ఆరు ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. పథకం ప్రారంభించిన సమయంలో దశల వారీగా అన్ని క్యాంటీన్లలో అల్పాహారం అందిస్తామని ప్రకటించినప్పటికీ, ఆచరణలో ఆ అడుగులు పడటం లేదు. నిర్వహణ సంస్థ అయిన హరే కృష్ణ మూవ్‌మెంట్‌కు, జీహెచ్ఎంసీ అధికారులకు మధ్య వచ్చిన కొన్ని విభేదాల వల్లే మిగతా కేంద్రాల్లో బ్రేక్ ఫాస్ట్ ప్రారంభం కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 50 ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ ఆధునిక కంటైనర్ క్యాంటీన్లలో.. ఆరంభంలో అన్ని వసతులు కల్పించినట్లు అధికారులు రంగుల చిత్రాలు చూపించారు. కానీ నేడు గ్రౌండ్ రియాలిటీ అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. చాలా సెంటర్లలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ఫిల్టర్లు పనిచేయకపోవడంతో తాగునీటి కోసం జనం బయటకు పరుగులు తీయాల్సి వస్తోంది. కొన్ని చోట్ల తాతాలికంగా నాసిరకం వాటర్ ప్యాకెట్లు ఇస్తూ సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
బ్రేక్ ఫాస్ట్ కే క్రేజ్!
రూ.5 లకే టిఫిన్ దొరుకుతుండటంతో ఉదయాన్నే పనుల కు వెళ్లే ఆటో డ్రైవర్లు, దినసరి కూలీలు, విద్యార్థులు, వలస కా ర్మికులు ఈ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. కేవలం 50 సెంటర్లలోనే నెలకు దాదాపు 3 లక్షల మంది అల్పాహారం తీసుకుంటున్నారు. ఐతే మెనూలో కోత విధించడం, పరిమిత కేంద్రాల్లోనే అందిస్తున్న తీరుపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెనూలో పాత వైవిధ్యాన్ని పునరుద్ధరించకపోతే.. పేదల కోసం తెచ్చిన ఈ పథకం ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోక తప్పదని మేధావులు హెచ్చరిస్తున్నారు.