LMD Venkateswara Temple | తిమ్మాపూర్,మార్చి17: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండీకాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయ అర్చకులు సోమవారం సాయంత్రం పూజలు చేసి తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున ఆలయం శుద్ధి చేసేందుకు వచ్చిన సిబ్బందికి తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి పూజారులకు సమాచారమందించారు.
అర్చకులు వచ్చి పరిశీలించగా స్వామివారి కిరీటం, అమ్మవారి నగలు, ఇతర ఆభరణాలు కనిపించకపోవడంతో ఆలయ కమిటీకి, పోలీసులకు సమాచారమిచ్చారు. దాదాపు ఆభరణాల విలువ రూ.10 లక్షల పైనే ఉంటుందని పండితులు తెలిపారు. ఆలయ దర్వాజా వద్ద గునపం, వాటర్ బాటిల్ పెట్టుకొని తీరిగ్గా దొంగతనం చేసినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. ఎల్ఎండి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫింగర్ ప్రింట్, క్లూజ్ టీం విభాగాలకు సమాచారం అందించారు. ఆలయంలో చోరీ ఘటన ఎల్ఎండీ తో పాటు మహాత్మానగర్లో కలకలం సృష్టించింది.