దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక, కర్షకలోకం సిద్ధమైంది. కార్మిక, రైతు, ఉద్యోగ వ్యతిరేక నిరంకుశ విధానాలకు నిరసనగా బుధవారం కదం తొక్కనున్నది. తాము సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసీ లేబర్ కోడ్ బిల్లు తెచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సమాఖ్యలు నేడు సార్వత్రిక సమ్మెకు పిలుపు నివ్వగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 3.50లక్షల మంది సంఘటిత, అసంఘటిత కార్మికులు పాల్గొనేందుకు రెడీ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు తెలుపనున్నారు.
కరీంనగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను, విద్యుత్తు బిల్లును, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ఆలోచనలను కేంద్రం విరమించుకోవాలని కార్మికులు, కర్షకులు, వివిధ రంగాల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమయ్యారు.
ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా తెస్తున్న నాలుగు లేబర్ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ కార్మిక విభాగంతోపాటు వామపక్ష పార్టీలైన అనుబంధ సంఘాలు నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటున్నదని ఇటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు కూడా సమ్మెకు రెడీ అయ్యారు.
సింగరేణి, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రక్షణ శాఖ బ్యాంకింగ్ ఫెడరేషన్, రైల్వేలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు. మరో పక్క టీఎన్జీవోలు కూడా మద్దుతు ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా 11 ట్రేడ్ ఫెడరేషన్లు సంయుక్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపు నిచ్చాయి. జిల్లాలో సమ్మెను విజయవంతం చేసేందుకు బీఆర్టీయూతోపాటు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూ, టీయూసీఐ, ఐఎఫ్టీయూ వంటి కార్మిక సంఘాలు ఐకమత్యంగా సమ్మెను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాయి.
కనిపించనున్న ప్రభావం
సార్వత్రిక సమ్మెకు ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 3.50 లక్షల మంది సిద్ధమయ్యారు. రవాణారంగం నుంచి ఆర్టీసీ పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లు, అద్దె బస్సుల నిర్వాహకులు కూడా పాల్గొంటున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఎలక్ట్రికల్ బస్సులు మినహా ఆర్టీసీ బస్సులన్నీ నిలిచిపోనున్నాయి. ఆటో కార్మికులు, లారీ డ్రైవర్లు కూడా సమ్మెకు రెడీ అయిన నేపథ్యంలో ప్రజా రవాణాకు ఆటంకాలు కలుగనున్నాయి. సేవా రంగాల నుంచి బ్యాంకు, బీఎస్ఎన్ఎల్, విద్యుత్ ఉద్యోగులు కూడా పాల్గొంటుండగా, కరెంట్ అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు నిలిచి పోనున్నాయి. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లు కూడా తమ సేవలను నిలిపివేయనున్నారు.
సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీ, బసంత్‌నగర్ సిమెంట్ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులతోపాటు గ్రానైట్, రైస్ మిల్లుల్లో పని చేసే కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్న నేపథ్యంలో ఉత్పత్తిపై ప్రభావం పడనున్నది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు సిద్ధమైన కారణంగా పారిశుధ్య సేవలకు అంతరాయం ఏర్పడనున్నది. రైల్వేలో హమాలీలో వ్యాగిన్ల లోడింగ్, అన్లోడింగ్ కూడా నిలిచిపోనున్నది. మొత్తంగా సార్వత్రిక సమ్మె ప్రభావం అనేక రంగాలపై పడనున్నది.
కదంతొక్కనున్న కార్మికలోకం
సమ్మెలో భాగంగా బుధవారం అన్ని జిల్లా కేంద్రాల్లో వామపక్ష పార్టీలు, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. బీఆర్ఎస్ కార్మిక విభాగం కూడా ఈ కార్యక్రమాల్లో పొల్గొననున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు వెయ్యి మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో కూడా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు.