Collector Koya Sriharsha | ధర్మారం, ఏప్రిల్ 30:కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు. ధర్మారం మండలంలోని దొంగతుర్తి, ఖిలా వనపర్తి, సాయంపేట, నంది మేడారం గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఖిలా వనపర్తి గ్రామంలో పల్లె దవాఖాన, నంది మేడారం పీహెచ్సీని ఆయన బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తేమ శాతం వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేయాలని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సెంటర్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం సత్వరమే మిల్లులోకి తరలించేందుకు అవసరమైన మేర వాహనాల సంఖ్య పెంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రైస్ మిల్లులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడ హమాలీల కొరత రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగాలని ఆయన అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. ఖిలా వనపర్తి పల్లె దవాఖాన ను ఆయన పరిశీలించి ఇక్కడి సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. అనంతరం నంది మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ పరిశీలించి, ప్రతీ గర్భిణీ తప్పనిసరిగా రికార్డులో నమోదు చేయాలని ఆయన సూచించారు. ఎన్సీడీ సర్వే పకడ్బందీగా నిర్వహించి బీపీ, మధుమేహం వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వైద్య అధికారులకు సూచించారు.
నూతనంగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాన్ని ఆయన పరిశీలించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం బంజేరుపల్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన 71 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో నాణ్యమైన ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇండ్ల నిర్మాణం లో 4 విడతల లో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం విడుదల చేయడం జరుగుతుందని,పనులు ప్రారంభించనీ లబ్ధి దారులను వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ రాజేశ్వర్, తహసీల్దార్ ఎండీ వకీల్, నంది మేడారం పీహెచ్సీ వైద్యులు అనుదీప్, సుష్మీత, ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్లా నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.