Karimnagar | కమాన్ చౌరస్తా, నవంబర్ 28 : రాష్ర్టంలో ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం క్షీణిస్తున్నదని, ఈ విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ విద్య పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక డిగ్రీ, పీజీ కళాశాలలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్య అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలల మనుగడ కొనసాగాల్సిందేనని, అందుకు ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయడమే కాకుండా, ప్రజలను చైతన్యవంతులను చేసి, ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. మరో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న శాతవాహన యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అరకొర సౌకర్యాలతో, ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే నడుస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించి, అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ జనరల్ సెక్రటరీ రఘుశంకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం విద్యారంగం సంక్షోభ సమయంలో ఉందని, ఈ సంక్షుభిత పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘాలుగా మనపైన గురుతరమైన బాధ్యత ఉందని పేర్కొన్నారు . ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ కో చైర్మన్ వై అశోక్ మాట్లాడుతూ, పాఠశాలల్లో ఉపాధ్యాయులను బోధనకు దూరంగా ఉంచి, విద్యేతర పనులు అప్పగిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు విద్యేతర బాధ్యతలు అప్పగించరాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ సెక్రటరీ కే రవిచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యా రంగానికి కనీసం 15 శాతం తమ బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఆవాల నరహరి మాట్లాడుతూ, ప్రభుత్వాలు విద్యారంగంలో అశాస్త్రీయ ధోరణులను ప్రవేశపెడుతున్నాయని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సరికాదన్నారు. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండకూడదని, ప్రజలను చైతన్యవంతులను చేసి, ఉద్యమాలను నిర్మించి, శాస్త్రీయ విద్యావిధానాలకు పెద్దపీట వేసేలా విద్యా విధానాలు రూపొందేలా పోరాడాలని, లేకపోతే చరిత్రలో మనకు స్థానం ఉండదని హెచ్చరించారు.
అనంతరం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కో జనరల్ సెక్రెటరీ రఘు శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఆవాల నరహరి(డీటీఎఫ్), గౌరవ అధ్యక్షులుగా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ప్రధాన కార్యదర్శిగా వీ బాలయ్య(టీపీటీఎఫ్), అసోసియేట్ అధ్యక్షులుగా కే రాజమల్లు, ఉపాధ్యక్షులుగా పి శ్రీనివాస్, డి ఏసు రెడ్డి, వీ రత్నం, సీహెచ్ ఆంజనేయరావు, పి లచ్చయ్య, అసోసియేట్ ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ రవీంద్ర చారి, కార్యదర్శులుగా పీ నర్సయ్య, ఎం రామలింగారెడ్డి, జి ఎల్లయ్య, టి మధుసూదన్ రెడ్డి, టి రాఘవులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కె నారాయణరెడ్డి, సీహెచ్ రాంమోహన్, పి ఈశ్వర్ రెడ్డి, ఎన్ తిరుపతి, జె రాంచంద్రారెడ్డి, వి జానకీదేవి, హుమేరా జబీన్, జయప్రద తదితరులు పాల్గొన్నారు.