Registrations | గంగాధర జూలై 4: భూముల రిజిస్ట్రేషన్ లతో నిత్యం కళకళలాడే గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్లు లేక బోసిపోతోంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల వల్ల రిజిస్ట్రేషన్లు జరగడం లేదని కార్యాలయానికి వచ్చిన ప్రజలు వాపోతున్నారు. గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి మండలాలు ఉన్నాయి.
కాగా ఆయా గ్రామాల పరిధిలోని కమర్షియల్ భూముల రిజిస్ట్రేషన్లు ఇక్కడ జరిగేవి. కాగా కొత్తపెల్లి మండలంలోని కొత్తపెల్లి, రేకుర్తి గ్రామాలకు చెందిన సర్వే నంబర్లను అధికారులు నిషేధిత జాబితాలో చేర్చడంతో ఆయా గ్రామాలకు చెందిన ఆయా గ్రామాలకు చెందిన రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేకాకుండా గ్రామాల్లోని ఆబాది భూములకు సంబంధించి ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయడానికి పంచాయతీ కార్యదర్శి సర్టిఫై చేయడం తప్పనిసరి అని చెప్పడంతో ఇండ్ల రిజిస్ట్రేషన్లకు కూడా బ్రేక్ పడింది.
కొత్తపల్లి, రేకుర్తి గ్రామాలకు సంబంధించి ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతుండడం, ఆ గ్రామాలలో రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడడంతో కార్యాలయానికి వచ్చే ప్రజల సంఖ్య తగ్గింది. అలాగే పంచాయతీ కార్యదర్శులు తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెబుతుండడంతో ఇండ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు. నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్లపై అధికారులు స్పష్టతనివ్వాలని, ఇండ్ల రిజిస్ట్రేషన్ పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి రిజిస్ట్రేషన్ లపై కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.