నకిలీ వైద్యులపై రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ కొరడా ఝులిపిస్తున్నది. ఎలాంటి అర్హత లేకున్నా వైద్యులుగా చెలామణి అవుతూ.. ల్యాబ్‌లు నిర్వహిస్తూ.. వచ్చీరాని వైద్యంతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నది. తమ పరిధి దాటి వైద్యం చేస్తున్న వారికి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఇప్పటికే లింగాపూర్‌లో ఓ మహిళా ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ వృద్ధురాలు మృతి చెందడం, ఇలానే ఎన్నో సంఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తుండగా.. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ ఆదేశాల మేరకు శనివారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో జిల్లా మెడికల్ కౌన్సిల్ బాధ్యులు రంగంలోకి దిగారు. ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహిస్తున్న క్లీనిక్‌లపై ఆకస్మిక తనిఖీలు చేయగా, అక్కడ జరుగుతున్న వైద్యాన్ని చూసి విస్తుపోయారు. తాజా తనిఖీల్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లీనిక్‌లపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. స్థాయిని మించి వైద్యం చేయొద్దని హెచ్చరించారు.
కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిధి దాటుతున్నారు. వచ్చీరాని వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేసి పట్టభద్రులైన వైద్యుల వద్దకు చికిత్స కోసం పంపాల్సి ఉన్నా.. అన్నీ తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఇంజక్షన్లు ఇవ్వడమే కాదు, ఏకంగా ఆపరేషన్లు చేసే స్థాయికి వెళ్లారు. శనివారం మెడికల్ కౌన్సిల్ బాధ్యులు ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంగా నీలోజిపల్లిలో ఓ ఆర్ఎంపీ ఇంజక్షన్ ఇస్తే 100 అని బాజాప్త బోర్డు పెట్టుకుని మరీ వైద్యం చేస్తున్నట్టు, అనుమతి లేకుండా ల్యాబ్ నడిపిస్తున్నట్టు గుర్తించడం పరిస్థితికి అద్దం పడుతున్నది. వచ్చీరాని వైద్యంతో రోగుల ప్రాణాల మీదికి తేవడమే కాదు, స్టెరాయిడ్ వంటివి కూడా ఇస్తుండడంతో రోగులు కోలుకోలేని పరిస్థితి వస్తున్నది. అంతే కాకుండా కమీషన్ల కక్కుర్తితో అవసరం లేకున్నా భయపెడుతూ.. కరీంనగర్ లాంటి నగరంలో విస్తరించి ఉన్న ప్రైవేట్ దవాఖానలకు పంపడం కనిపిస్తున్నది. ఇటు ప్రైవేట్ వైద్యులు కూడా వీరికి పెద్ద మొత్తంలో కమీషన్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
మానకొండూర్ మండలం లింగాపూర్‌లో ఓ ఆర్ఎంపీ వచ్చీరాని వైద్యం చేసి ఓ వృద్ధురాలు ప్రాణాలు పోవడానికి కారకురాలైంది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నా వెలుగులోకి రాకుండా పోతున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే కాకుండా ఇటీవలి కాలంలో వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్ ఆదేశాల మేరకు జిల్లాల బాధ్యులు రంగంలోకి దిగారు. హెల్త్ కేర్ రిపామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్, ఐఎంఏ సభ్యులు డాక్టర్ వంశీ, హెచ్ఆర్డీఏ కార్యదర్శి డాక్టర్ గౌతం, విజిలెన్స్ ఆఫీసర్ భరత్‌కుమార్ తదితరులు సంయుక్తంగా శనివారం ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహిస్తున్న క్లీనిక్‌లపై దాడులు చేస్తున్నారు.
శనివారం సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి, కొదురుపాక, కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం చింతకుంట, ఆసిఫ్‌నగర్ గ్రామాల్లో తనిఖీలు జరిపారు. ఆసిఫ్‌నగర్‌లో రీసా క్లీనిక్, వందనా క్లీనిక్, సిటీ క్లీనిక్, శ్రీవిషిక క్లీనిక్ అండ్ ల్యాబ్, చింతకుంటలో ఆనంద్ క్లీనిక్ అండ్ ల్యాబ్, నీలోజిపల్లి గ్రామాల్లో జక్కని లక్ష్మీనారాయణ ఎలాంటి విద్యార్హతలు లేకుండా 25 ఏళ్లుగా కరుణ క్లీనిక్ పేరిట అనుమతి లేని క్లీనిక్, ల్యాబ్‌ను నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ క్లీనిక్‌లో అనేక అలోపతి ఇంజక్షన్లు, యాంటిబయాటిక్, స్టెరాయిడ్స్ కూడా లభించినట్టు మెడికల్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.
అనుమతి లేకుండా, హద్దులు మీరి వైద్యం చేస్తున్న వారిపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝులిపిస్తున్నది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ఐదు కేసులు నమోదైనట్టు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. తాజా తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అనుమతి లేని క్లీనిక్‌లు నిర్వహిస్తున్న వారిపైన కూడా కేసులు నమోదు చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టం-2019 సెక్షన్ 34,54 ప్రకారం అర్హత లేకుండా అలోపతి వైద్యం చేసినట్లయితే 5 లక్షల జరిమానా, ఏడాది పాటు జైలు విధించ వచ్చని, తెలంగాణ రాష్ట్ర మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 20, 22ప్రకారం కూడా శిక్షార్హులు అవుతారని చెప్పారు. క్లీనికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ జీవో నంబర్ 47 అండ్ 48 ప్రకారం దవాఖానల రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.