కమాన్చౌరస్తా, అక్టోబర్ 11 : జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం మహార్నవమి మహిషాసురమర్దిని దేవి(సిద్ధి ధాత్రీ) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు మహిషాసురమర్ధిని దేవి పూజ, వేదపండితులు రుద్రసహిత చండీహోమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన మహిషాసుర సంహారం ఆకట్టుకున్నది. కాగా, మహాశక్తి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు.
కరీంనగర్ రూరల్, అక్టోబర్ 11: నగునూర్ గ్రామంలోని దుర్గాభవానీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణ అలంకరణలో ఆది సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మాధికారి, వేదపండితుడు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.