Mallapoor | మల్లాపూర్, జూలై 4: మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కనక సోమేశ్వర స్వామి కొండ శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. కొండపైకి కాలినడకన భక్తులు ఎక్కి సహస సిద్ధమైన కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, సోమేశ్వర స్వామికి ప్రీతి పాత్రమైన వరద పాశం (బెల్లపు అన్నం) నైవేద్యాలు వండుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి వరద పాశం పోసి తమ మోక్కులను చెల్లించుకున్నారు.
ఇలా చేస్తే పాడి, పంట, ఆరోగ్యం, వర్షాలు సమృద్ధిగా ఉంటాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రధాన అర్చకుడు ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్పించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు సంగ గంగరాజం, వైస్ చైర్మన్ ఇల్లెందుల తుక్కరం, కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.