Siricilla | సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 2 : జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న చేనేత చైతన్య మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో ఆదివారం మహాసభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగే ఈ మహాసభలో చేనేత కళాకారులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అలాగే నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు సన్మానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చేనేత వర్గాలకు చెందిన కులబంధువులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోర లక్ష్మిరాజం, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుజ్జె తార, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంకారపు మహేష్, జిల్లా అధ్యక్షుడు శ్రీగాధ మైసయ్య, సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ, తంగళ్లపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాపెల్లి ఆనందం, యువజన విభాగం అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బీమని అశోక్, ప్రధాన కార్యదర్శి మచ్చ ఆంజనేయులు, సహాయ కార్యదర్శి తుమ్మ దేవేందర్, సాంస్కృతిక కార్యదర్శి సామల రమేష్, యువజన విభాగం సలహాదారు బండి జగన్, నాయకులు సామల గణేష్, బీమని అరవింద్ తదితరులు పాల్గొన్నారు.