Peddapally | రామగిరి, అక్టోబర్ 15: రామగిరి మండలం బేగంపేట గుట్టపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది.. గుట్టను తవ్వడం.. మట్టిని ట్రాక్టర్ల కొద్ది తరలించడం అంతా చూస్తుండగానే సవ్యంగా సాగుతోంది. బండెనుక బండి అన్నట్టుగా ట్రాక్టర్ల కొద్దీ మొరం మట్టి తరలిపోతుంది. ప్రభుత్వ భూమిలో అడుగు పెడితేనే ఊరుకోని అధికారులు.. మరిక్కడ ఏకంగా విలువైన మొరం మట్టిని తవ్వడమే గాకుండా ట్రాక్టర్ల కొద్ది మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే అడ్డు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ప్రభుత్వ ఆధీనంలో గల భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడని బేగంపేట గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా మొరం మట్టిని తరలిస్తున్నారని వాపోతున్నారు. తవ్విన మట్టిని మండలంలోని నాగెపల్లి, రత్నాపూర్, సెంటినరీకాలనీ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా జారగొడుతున్నట్లు పేర్కొంటున్నారు. గుట్ట నుంచి మట్టిని ట్రాక్టర్ల కొద్ది తరలిస్తున్నా రెవెన్యూ గానీ, మైనింగ్ అధికారులు చోద్యం చూడటం పట్ల గ్రామస్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భూముల్లో పాగా వేసి మట్టిని తవ్వి తరలిస్తున్న దందా వెనుక ఎవరున్నారనేది మండలంలో చర్చకు తెరలేపింది. అక్రమ మట్టి తవ్వకాలతో పర్యావరణంకు తీవ్ర నష్టం వాటిల్లుతోందనీ, ప్రధానంగా గ్రామీణ రోడ్లు ఆనవాళ్లు కోల్పోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకొని మట్టి తరలింపును అడ్డు కట్ట వేసి అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.