మెట్పల్లి మున్సిపల్టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి జోరుగా సాగుతున్నదా..? కొందరు అధికారులు, సిబ్బంది అక్రమార్జనకు అడ్డు లేకుండా పోయిందా..? కాసులిస్తేనే ఇంటి పర్మిషన్ వస్తుందా..? లేదంటే ముప్పు తిప్పలు తప్పవా..? అంటే అవుననే తెలుస్తున్నది. ఇటీవల జగిత్యాల కలెక్టర్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేయడం, విచారణకు ఆదేశించడంతో అవినీతి బట్టబయలైంది. తాజాగా టీపీవోను సస్పెండ్ చేయడంతోపాటు తాత్కాలిక ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టించింది.
మెట్పల్లి/ జగిత్యాల కలెక్టరేట్, జూన్ 17 : మెట్పల్లి మున్సిపల్టౌన్ ప్లానింగ్ విభాగంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతి పొందడం నుంచి నిర్మాణం పూర్తయి ఇంటి నంబర్ వచ్చే వరకు సంబంధిత విభాగాల్లో అధికారులు, సిబ్బందికి అడిగినంత చెల్లించుకోవాల్సి వస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే యజమానులను ముప్పుతిప్పలు పెడుతున్నట్టు తెలుస్తున్నది. సాధారణంగా ఇంటి నిర్మాణం కోసం అవసరమైన అనుమతులు తీసుకున్నాక పనులు మొదలు పెడతారు. అయితే, ఇక్కడ అనుమతి పొందడమే ఒక అగ్ని పరీక్ష! సంబంధిత అధికారులకు లంచాలు ముట్టనిదే ఏ పని కాదనే ఆరోపణలున్నాయి.
ఇక నిర్మాణానికి సంబంధించి ఫునాది తీసి పనులు మొదలు అవడమే ఆలస్యం.. టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి మళ్లీ వేధింపులు మొదలవుతాయి. సెట్ బ్యాక్ లేదనో.. అనుమతి తీసుకున్న ప్లాన్‌కు అనుగుణంగా ఇంటిని నిర్మించడం లేదనో.. తమకు అనుకూలురైన కొందరితో ఫిర్యాదులు తెప్పించుకోవడం, ఆ వెంటనే నోటీసులు ఇచ్చి నిర్మాణ పనులు ఆపించడం వంటివి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పనులు మధ్యలో నిలిచిపోవడంతో అనేక మంది నిర్మాణదారులు.. మధ్యవర్తుల ద్వారానో లేదా నేరుగా సంబంధిత అధికారులను కలిసి అడిగినంత చదివించుకుంటే తప్ప ఆ పనులు తిరిగి మొదలు కాని దుస్థితి ఉన్నది. అంతేకాదు, ఫలానా వ్యక్తి తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు.. వారిని కలిసి మాట్లాడుకోవాలని, మళ్లీ తమకు ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని సదరు అధికారులే చెబుతున్నారని కొందరు నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. యూపీఐ ద్వారా చెల్లిస్తామన్నా తీసుకునేందుకు వెనుకాడడం లేదని చెబుతున్నారు.
ఇటీవల ఓ మహిళ ఫిర్యాదుతో టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు బట్టబయలయ్యాయి. టీపీవో రాజేంద్రప్రసాద్‌ను సస్పెండ్ చేయడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం ఆరోపణలను నిజం చేస్తున్నాయి. పట్టణానికి చెందిన జగ్గుల లావణ్య ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని పనులు చేపట్టింది. ఆ ఇంటికి సంబంధించి సెట్ బ్యాక్ లేదని, అనుమతి పొందిన ప్లాన్‌కు భిన్నంగా నిర్మిస్తున్నారని అదే కాలనీకి చెందిన తమకు అనుకూలురైన వారితో టీపీవో, అతని సహాయకుడిగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఫిర్యాదు చేయించి, ఆ వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించినట్టు తెలిసింది.
దీంతో ఆమె వారిని సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేయడంతో అందుకు అంగీకరించి కొంత నగదును చేతికి, మరికొంత ఫోన్ పే ద్వారా చెల్లించింది. కొంత కాలం తర్వాత డబ్బుల కోసం మళ్లీ వేధించడంతో విసిగిపోయిన లావణ్య పూర్తి ఆధారాలతో ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టగా, ఫోన్ పే ద్వారా డబ్బులు లంచంగా స్వీకరించినట్టు నిర్ధారణ అయింది.
ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు లంచం తీసుకొని నకిలీ పత్రాలు అందజేశారనే కారణంతో మెట్పల్లి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. అదే విభాగంలో ఔట్ సోర్సింగ్‌గా విధులు నిర్వహిస్తున్న లింబాద్రిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ మేరకు కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెట్పల్లిలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగా, రూ.2లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని, పలు దఫాలుగా రూ.58,400 యూపీఐ ద్వారా చెల్లించానని, తీరా సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటి నిర్మాణ పత్రాలు అందించారని జగ్గుల లావణ్య ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపి, టీపీవో రాజేంద్రప్రసాద్, ఔట్ పోర్సింగ్ ఉద్యోగులను సంజాయిషీ కోరారు. అయితే సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో చర్యలు తీసుకున్నారు. అయితే టీపీవోతోపాటు అందులో పనిచేసే మరికొంత మంది సిబ్బందిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మెట్పల్లి నుంచి బదిలీ చేసుకునేందుకు టీపీఓ ప్రయత్నించగా, అతని అవినీతిపై విచారణ జరిగే వరకు ఇక్కడి నుంచి బదిలీ చేయకూడదంటూ కొందరు కౌన్సిలర్లు ఆందోళన కూడా చేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు కలెక్టర్ చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతున్నది.