మామిడి రైతుకు కాతకు ముందే నిరాశ మొదలైంది. డిసెంబర్ నెలాఖరు వరకు తోటలు పూత పూసి పిందె దశకు చేరుకోవాల్సి ఉన్నా.. ఈసారి తీవ్రమైన చలి ప్రభావంతో మొగ్గ కూడా రాక ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం 5 నుంచి 10 శాతం మాత్రమే పూత రాగా, 80 శాతం తోటల్లో అసలు పూత ఆనవాళ్లు కనిపించడం లేదు. చలి తీవ్రత వల్లే ఈ సారి పూత ఒక నెల ఆలస్యమవు తుందని, యాజమాన్య పద్ధతులు పాటించాలని అధికారులు చెబుతున్నారు.
జగిత్యాల టౌన్, డిసెంబర్ 28 : రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటున్నది. గతంలో పోలిస్తే.. ఈ సారి మరింత భయపెడుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండగా, ఈ ప్రభావం పంటలపైనా పడుతున్నది. దీని వల్ల ఎదుగుదల లోపించి, సకాలంలో పూత, కాత రాకుండా పోతున్నది. ప్రధానంగా మామిడి తోటలకు ఎక్కువగా నష్టం వాటిల్లుతున్నది. ఏటా డిసెంబర్లో విపరీతంగా పూత వచ్చే చెట్టుకు ఈ సారి డిసెంబర్ నెల పూర్తవుతున్నా 5 నుంచి 10 శాతం మాత్రమే కనిపిస్తున్నది.
జగిత్యాల జిల్లాలో 35 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, 80 శాతం తోటల్లో పూత ఆనవాళ్లే కనిపించడం లేదు. చలి కారణంగా పూత ఆలస్యమయ్యేలా ఉంది. ఈ యేడాది అక్టోబర్ నెలాఖరు దాకా వర్షాలు పడడం, నవంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత పెరగడం వల్ల పూత ఒక నెల ఆలస్యంగా వస్తుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉందని సూచిస్తున్నారు. గతంలోనూ ఇలానే ఆలస్యమై నష్టం వాటిల్లగా, ఈ సారి అలాంటి పరిస్థితే ఉంటుందేమోనని మామిడి వ్యాపారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి ఒక నెల ఆలస్యమైతే వర్షాలు మొదలై కాయల అమ్మకంలో ఇబ్బందులు ఏర్పడుతాయని తోటలు పట్టుకునేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు.
వ్యవసాయ అధికారుల సూచనలు
ఇప్పటి వరకు మొగ్గలు అస్సలు కనిపించని, ఇంత వరకు దున్నని తోటలను దున్నించి పుష్కలంగా నీరు అందిస్తే మొగ్గలు ఏర్పడి విచ్చుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఒక లీటరు నీటికి లాండ సైహలోత్రిన్ 1 మిల్లీలీటర్లు, అసిపేట్ 2 గ్రాములు, 12-61 3 గ్రాములు, సిలికాన్ స్ప్రేడర్ 0.5 మిల్లీలీటర్లు, సాప్ 3 గ్రాముల చొప్పున కలిపి స్ప్రే చేస్తే పూత త్వరగా వస్తుందని, తెగుళ్ల బారి నుంచి తోటలు తట్టుకుంటాయని సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరగడం వల్ల వచ్చిన పూతలోనూ బూడిద తెగులు ఆశించి ఫలదీకరణ చెందకుండా చేస్తుందని, మొగ్గలు విచ్చుకునే దశలో లీటర్ నీటికి సల్ఫర్ 3 గ్రాములు, బోరాన్ 2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలని సూచిస్తున్నారు.