‘అవి నా మనుషుల ఇసుక డంప్‌లు. అక్రమంగా చేసుకున్నారా.. సక్రమంగా చేసుకున్నారా? మీకు అనవసరం. నా అనుమతి లేనిదే నా సహచరులు, అనుచరుల ఇసుక డంప్‌లను సీజ్ చేస్తారా..? నౌకరీ చేయాలని ఉందా.. లేదా?’ అంటూ జగిత్యాలలోని అధికారులపై ఓ ప్రజాప్రతినిధి హూంకరించినట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ బైపాస్ రోడ్డుకు ఇరువైపులా, కొంత లోపలికి ఖాళీగా ఉన్న స్థలాల్లో ఇసుక అక్రమంగా డంప్ చేయడంపై ‘నమస్తే’లో ‘దారి పొడవునా ఇసుక కుప్పలే’ శీర్షికన సోమవారం కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేసేందుకు వెళ్లిన అధికారులకు, సదరు ప్రజాప్రతినిధి ఫోన్ చేసి తన అనుచరులవి ముట్టద్దని, ఒకరిది మాత్రం వదిలి పెట్టవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం.
జగిత్యాల, మే 6 (నమస్తే తెలంగాణ) : జగిత్యాలలోని రాజీవ్ బైపాస్ రోడ్డుకు ఇరువైపుల ఉన్న స్థలాల్లో ఇసుక అక్రమంగా డంప్ చేయడంపై ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన ‘దారి పొడవునా ఇసుక కుప్పలే’ కథనం సంచలనం రేపింది. దీనిపై కలెక్టర్ ఆదేశాలతో యంత్రాంగం కదిలింది. డంప్ చేసిన ఇసుక కుప్పలను అధికారులు సీజ్ చేస్తుండడంతో ఇసుక స్మగ్లర్లు ఓ ప్రజాప్రతినిధిని కలిసి కాపాడాలని మొరపెట్టుకోవడంతో.. సదరు ప్రజాప్రతినిధి అధికారులకు ఫోన్ చేసినట్టు సమాచారం. ‘సార్.. పై ఆఫీసర్ ఆదేశాలు ఇచ్చారు. అందుకే సీజ్ చేస్తున్నాం’ అని వారు తెలియజేయడంతో ఉన్నతాధికారికి ఫోన్ చేసి తన అనుచరులకు సంబంధించిన ఇసుకను ఎలా సీజ్ చేస్తారంటూ ప్రశ్నించినట్లు తెలిసింది.
‘పత్రికల్లో వార్తలు వచ్చాయి. వారికి ఏం సమాధానం చెప్పమంటారు. అందుకే సీజ్ చేస్తున్నాం’ అని ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధికి విన్నవిస్తే.. ‘వాళ్లు అట్లాగే రాసుకుంటారు. రాసుకోనివ్వండి. ఏమవుతుంది? మీరు సీజ్ చేస్తున్న ఇసుక కుప్పల్లో నా వాళ్లు ఏడెనిమిది మంది ఉన్నారు. వారందరికి సంబంధించిన కుప్పలను వదిలిపెట్టండి. నాకు వ్యతిరేకంగా ఉన్న వాడికి చెందిన ఇసుక కుప్పలు మాత్రం కచ్చితంగా సీజ్ చేయండి. ట్రాక్టర్లు పెడుతారో.. టిప్పర్లు పెడుతారో పెట్టండి. వాడికి సంబంధించిన ఇసుక కుప్పలను మాత్రం తరలించండి.
‘మా వాళ్ల కుప్పలను వదిలిపెట్టండి.. ఇప్పటికే మావాళ్లవి కూడా ఒకటి, రెండు ట్రాక్టర్ల ఇసుక సీజ్ చేసి తరలించుకుపోయారంటా.. ఇగ ముట్టకండి. ఎవరైనా అడిగితే వే బిల్లు ఉందని, ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారని చెప్పండి. రేపు పొద్దున వరకు మావాళ్లు ఇసుకను అక్కడి నుంచి తరలించుకుంటారు. రోడ్డు పక్కన కాకుండా రోడ్డుకు వంద, రెండు వందల మీటర్ల దూరంలో డంప్‌లు మా వాళ్లవి ఉన్నాయి. వాటిని మీరు ముట్టకండి. చూసీ చూడనట్టు వదిలిపెట్టండి. వాడిది మాత్రం వదిలిపెట్టద్దు’ అంటూ ఆదేశించడంతో అధికారులు తలొగ్గినట్టు సమాచారం. ఇప్పటికీ బైపాస్ రోడ్డులో కొన్ని ఇసుక కుప్పలు అక్కడక్కడ కనబడుతూనే ఉన్నాయి.
ఒక్కడిదే ఎట్లా సీజ్ చేస్తరు?
అధికారులు ఒక వ్యక్తికి సంబంధించిన ఇసుక డంప్‌లను సీజ్ చేసి, ఇసుకను తరలించడంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురై జిల్లాలోని మరో ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నట్టు సమాచారం. ‘తొమ్మిది మందికి చెందిన ఇసుక డంప్‌లు బైపాస్కు ఇరుపక్కల ఉంటే, అధికారులు కేవలం నా ఒక్కడి డంప్‌లను మాత్రమే సీజ్ చేశారు సార్. మిగిలిన వారివి వదిలిపెట్టారు. నాపై, నాకొడుకుపై కక్షపెట్టుకొని ఇదంతా ఫలానా ప్రజాప్రతినిధి చేయించాడు’ అంటూ రోదించడంతో సదరు మరో ప్రజాప్రతినిధి ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్టు తెలిసింది.
‘సార్ ఏం చేయమంటారు? అందరివి సీజ్ చేస్తామని అనుకున్నాం. ప్రజాప్రతినిధి సార్ అట్ల కలువదన్నారు. మీరు చెబుతున్న వ్యక్తికి సంబంధించిన ఇసుక డంప్‌లను సీజ్ చేయకుండా వదిలి పెట్టవద్దని గట్టిగా చెప్పారు. ఆయన చెప్పినట్లే చేశాం. మేం ఏం చేయమంటారు సార్’ అంటూ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధికి వివరించడంతో ‘అలా చేయడం కరెక్ట్ కాదు కదా.. అధికారులు ఇలా వివక్ష చూపించవచ్చునా..? ఇంకోసారైనా ఇలా కాకుండా చూసుకోండి’ అంటూ సుతిమెత్తగా చెప్పినట్టు తెలిసింది. కాగా, ఇసుక డంపుల విషయంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు సమాచారం.
జగిత్యాల చుట్టుపక్కల 30 వరకు డంప్‌లు!
జగిత్యాల బైపాస్‌లోనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు, సమీప గ్రామాల పరిధిలో 30 వరకు భారీ ఇసుక డంప్‌ల నిర్వహణ యథేచ్ఛగా సాగుతున్నది. జగిత్యాల నుంచి నర్సింగాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో రెండు పెద్ద ఇసుక డంప్‌లున్నాయి. దాదాపు ఇక్కడ ఎప్పుడు పది టిప్పర్ల ఇసుక ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ధరూర్ గ్రామ శివారులో ఉన్న చిన్ని దాబా వద్ద అన్నింటి కంటే పెద్దవైన రెండు ఇసుక డంప్‌లను నిర్వహిస్తున్నారని అధికారులే చెబుతున్నారు. తిప్పన్నపేట రోడ్డు, పెరకపల్లి రోడ్డులో, మోతె వాటర్ ట్యాంకర్ పక్కన రెండు, ఉప్పరిపేట చెరువు కట్ట వద్ద రెండు, చల్గల్రోడ్డులో రెండు, జాఫర్ కట్టె మిషన్ నుంచి మోతె బైపాస్‌రోడ్డులో ఒకటి, వంజరిపల్లి, అంబారిపేట రోడ్లలో మూడు, తాటిపల్లి గ్రామ శివారులో ఒకటి ఇలా 30 వరకు డంప్‌లు నిరాటకంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది.
అయితే, ఈ డంప్‌లపై దాడి చేసి సీజ్ చేద్దామంటే వీలు కావడం లేదని అధికారులు వాపోతున్నారు. ఇసుక డంపులు నిర్వహించే వారందరికి గట్టి పరపతి ఉందని, వారి డంప్ వద్దకు వెళ్లే సరికే తమకు ఫోన్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి ఫోన్ చేసి.. ‘మీరు మాటి మాటికీ అధికారులు ఇసుక డంప్‌లపై దాడులు చేసి ఇసుకను సీజ్ చేస్తున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను తరలించుకు వస్తుంటే వారిని అడ్డుకుంటున్నారు. ఇది మంచిది కాదు, పట్టణం చుట్టుపక్కల మా మనుషులు ఇసుక డంప్‌లను పెట్టుకొని జీవనోపాధి పొందుతున్నారు. వారికిదే బతుకుదెరువు. వాటిని మీరు అడ్డుకోవద్దు’ అంటూ అధికారులకు తేల్చిచెప్పినట్టు సమాచారం. కాగా, బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఇసుక డంప్‌ల సీజ్ విషయంలో వస్తున్న ఆరోపణలపై ఆర్డీవో మధుసూదన్‌ను వివరణ కోరేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఆయన స్పందించకపోవడం గమనార్హం.