రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోవడం సర్కారు చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతున్నదని బీఆర్ఎస్ నాయకులు దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు నిర్వహించి, ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసే దాకా తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
కార్పొరేషన్, ఆగస్టు 22: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ధర్నా చేశారు. ధర్నా ఆరంభంలో తెలంగాణ తల్లి విగ్రహం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీరును నిరసిస్తూ తెలంగాణ తల్లి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలన్నారు.
తెలంగాణ ఉద్యమానికి రాజీవ్‌గాంధీకి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. ఆయన విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఎలా ఏర్పాటు చేస్తారని నిలదీశారు. పిల్లల ముందు సీఎం స్థాయి తన స్థాయిని మరిచి కేసీఆర్‌పై అసభ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. వెంటనే రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలన్నారు.
ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఏం మాయరోగం వచ్చిందని హామీలను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. రుణమాఫీపై ప్రభుత్వంలోని మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు. నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలతో రైతులను ఆగం చేయవద్దని సూచించారు.
ధర్నా అనంతరం డీఆర్వో పవన్‌కుమార్‌కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ మండల నాయకులు శ్యాంసుందర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌గౌడ్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
హుజూరాబాద్, ఆగస్టు 22: నియోజకవర్గ కేంద్రం హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో దద్దరిల్లింది. ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకురాలు, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు అరగంట రాస్తారోకో చేసిన తర్వాత, పోలీసులు బలవంతంగా నాయకులను డీసీఎం వ్యానులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టూరిజం శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ పోలీస్‌స్టేషన్‌లో నాయకులను పరామర్శించారు. పోలీసులతో మాట్లాడి నాయకులు, కార్యకర్తలను విడిపించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, సింగిల్‌విండో అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, పార్టీ పట్టణ మండలాధ్యక్షులు సంగెం అయిలయ్య, కొలిపాక శ్రీనివాస్, నాయకులు చొల్లేటి కిషన్‌రెడ్డి, గందె శ్రీనివాస్, ఇరుమల్ల సురేందర్ రెడ్డి, పావనిగౌడ్, మంద సతీశ్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులున్నారు.
సైదాపూర్, ఆగస్టు 22: మండల కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మండల తహసీల్దార్, వ్యవసాయాధికారులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా విడుదల చేయాలని వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, జిల్లా నాయకులు, మాజీ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వెన్నంపల్లి సింగిల్‌విండో అధ్యక్షుడు బిల్ల వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు రావుల రవీందర్‌రెడ్డి, తిప్పారపు సారయ్య, సంపత్, ఓదెలు, ప్రకాశ్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, రేగుల అశోక్, గాజర్ల ఓదెలు, చాడ ఆదిరెడ్డి పాల్గొన్నారు.
చిగురుమామిడి, ఆగస్టు 22 : చిగురుమామిడి మండలం చిన్న ములనూర్ గ్రామంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో కరీంనగర్, హుస్నాబాద్ వెళ్లే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఎస్ఐ బండి రాజేశ్, పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను రోడ్డుపై నుంచి ఒకొకరిని పక్కకు తరలించారు.
అనంతరం బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి అడ్డగోలు ఆంక్షలతో రైతులకు కుచ్చుటోపీ పెట్టిందని మండిపడ్డారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు.
ఆయా కార్యక్రమాల్లో మాజీ వైస్ ఎంపీపీ భేతి రాజిరెడ్డి, మండల నాయకులు పెసరి రాజేశం, రామోజు కృష్ణమాచారి, బుర్ర తిరుపతి, ఎండీ సర్వర్ పాషా, ఎసే సిరాజ్, ముప్పిడి వెంకట నరసింహారెడ్డి, సన్నిల్ల వెంకటేశం, ముప్పిడి రాజిరెడ్డి, బెజ్జంకి లక్ష్మణ్, చెప్యాల నారాయణ రెడ్డి, వర్ణ వెంకటరెడ్డి, దుడ్డేల లక్ష్మీనారాయణ, సందీప్ రెడ్డి, బరిగెల సదానందంతో పాటు మండలానికి చెందిన నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.
గంగాధర, ఆగస్టు 22: మండలంలోని మధురానగర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల మధుసూదన్, కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల దామోదర్, వేముల అంజి, రామిడి సురేందర్, వడ్లూరి ఆదిమల్లు, గంగాధర వేణు, మామిడిపెల్లి అఖిల్, గంగాధర మోహన్, గంగాధర నగేశ్ తదితరులు పాల్గొన్నారు.