Lingannapet murder | ఎల్లారెడ్డిపేట, జూన్ 16: తమతో నిత్యం కలిసి తిరిగే మితృడు ఇన్‌స్టా గ్రాములో నిత్యం గొడవపెట్టుకుంటున్నాడని, దీంతో పాటు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, మద్యం మత్తులో కుటుంబ సభ్యులను తిట్టాడనే కసితో ఉన్న ఓ వ్యక్తి మరో మితృడికి కాల్ చేసినప్పుడు చంపేయమని సలహా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బీర్ బాటిల్‌తో మెడను కోసి హత్యకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకోవడంతో లింగన్నపేట యువకుడి హత్య కేసు మిస్టరీ వీడింది. సీఐ శ్రీనివాస్‌గౌడ్ సమాచారం ప్రకారం.. లింగన్నపేటకు చెందిన మెండె సతీశ్, నర్మాల పవన్‌కుమార్, భీమయ్య గారి రాజశేఖర్ అనే ముగ్గురు స్నేహితులు భవన నిర్మాణ కార్మికులుగా ఒకే చోట పనిచేసేది.
మెండె సతీశ్ తన అవసరాలకు భీమయ్య గారి రాజశేఖర్ వద్ద అప్పుగా కొంత డబ్బును తీసుకున్నాడు. సదరు డబ్బులు ఎంత అడిగినా ఇవ్వక పోవడంతో సతీశ్‌పై కోపాన్ని పెంచుకున్నాడు. అలాగే ముగ్గురు స్నేహితులు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఈ నెల 13న మెండె సతీశ్, నర్మాల పవన్‌కుమార్ గ్రామం శివారులో దావత్ చేసుకుంటుండగా సతీశ్ పవన్‌కుమార్‌ను అతని కుటుంబ సభ్యులను గురించి అసభ్యంగా అభ్యంతరకర తీరుతో మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన పవన్ తన మరో మితృడు రాజశేఖర్‌కు జరిగిన ఘటన గురించి పోన్లో వివరించాడు. అప్పటికే సతీశ్‌పై కోపంగా ఉన్న రాజశేఖర్ పవన్‌కు సలహా ఇస్తూ తాము ఇది వరకే సతీశ్‌ను చంపాలనుకున్నాం కదా అవకాశం దొరికింది చంపేయమని పోన్లో చెప్పాడు. రాజశేఖర్ ప్రోద్భలంతో పవన్ తన చేతిలో ఉన్న బీర్‌బాటిల్‌తో సతీశ్ తలపై కొట్టి, మెడపై కోయగా అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితులిద్దరిని గుర్తించి పట్టుకుని ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హత్య కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐలు ప్రేమానందం, రమాకాంత్, సిబ్బందిని సీఐ అభినందించారు.