Peddapally | పెద్దపల్లి, అక్టోబర్5: ప్రజల సంక్షేమం, అభ్యన్నతి కోసం పని చేసిన మహనీయుల స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గడ్డం వెంకట స్వామి (కాక) జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించగా, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జల్ద అరుణ శ్రీ, జిల్లా అధికారులు పాల్గొని వెంకట స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు వెంకట స్వామి (కాక) కేంద్ర మంత్రిగా, వివిధ పదవులు చేపట్టి, ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయడంలో వెంకట స్వామి కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ డెవలప్మెంట్ అధికారి రవీందర్, జిల్లా క్రీడల అధికారి సురేష్, పెద్దపల్లి, మంథని ఆర్డీవోలు గంగయ్య, సురేష్, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు బీ ప్రకాష్, కేవై ప్రసాద్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.