బడి పిల్లల కడుపుమాడుతున్నది. సర్కారు నిర్లక్ష్యంతో నోటికాడి బుక్క ఎత్తిపోయింది. స్కూల్లో రోజూ ఉదయాన్నే అందే పౌష్టికాహారం దూరమైపోతున్నది. ‘విద్యారంగాన్ని సంస్కరిస్తాం. విద్యాలయాలకు వన్నె తెస్తాం’ అని ఇన్నాళ్లూ బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కారు, పిల్లల ఆకలి తీర్చే రాగి జావ, బెల్లం ముక్క పోషకాహార పథకానికి మంగళంపాడింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సత్యసాయి ట్రస్టుతో సంయుక్తంగా కలిసి అందించలేమంటూ చేతులెత్తేసింది. ప్రభుత్వ సహకారం లేకపోవడంతో ట్రస్టు సైతం సొంతంగా అమలు చేయలేమంటూ ఆగస్టు నుంచి పక్కకు తప్పుకోగా, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పథకాన్ని అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
జగిత్యాల, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘విద్యా రంగాన్ని సంస్కరిస్తాం. ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తాం. సమీకృత గురుకులాలను నిర్మిస్తాం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలు కడుతాం’ ఇలా సర్కారు మాటలు వింటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. కానీ, ఆచరణలోకి వచ్చే సరికి మాత్రం పరిస్థితి దారుణంగా ఉన్నది. బడి పిల్లలకు కనీసం ఉదయం పూట ఇచ్చే రాగిజావ, బెల్లం ముక్కను అందించలేని దుస్థితికి దిగజారిపోయింది.
బడి పిల్లల్లో పౌష్టికాహారం లోపం పెరిగిపోతున్నదని ఎన్నో ఏండ్లుగా అంతర్జాతీయ సంస్థలు, భారతీయ ఆహార సంస్థ మొత్తుకుంటూ వస్తున్నాయి. దీంతో దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అలాగే ప్రధాని పోషక అభియాన్ పథకాన్ని తెచ్చి బాలింతలు, గర్భిణులు, ఐదేండ్ల లోపు చిన్నారులకు కొన్నేళ్లుగా పౌష్టికాహారం అందిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు పౌష్టికాహారం అందజేయాలన్న ఉద్దేశంతో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు స్వచ్ఛందంగా రాగిజావ, బెల్లం అందజేయాలని నిర్ణయించింది. 2015 నుంచి 2022 దాకా జిల్లాకు 30వేల మంది పిల్లల చొప్పున ఏడు జిల్లాల్లో సొంత ఖర్చులతో రాగిజావ, బెల్లం అందజేస్తూ వచ్చింది. మార్కెట్లో 10 నుంచి 15 విలువ చేసే రాగిప్యాకెట్, అలాగే 10 గ్రాముల బెల్లం ప్యాకెట్‌ను పిల్లల్లో ఐరన్‌ను వృద్ధి చేసేందుకు, ముఖ్యంగా ఆడపిల్లలో హిమోగ్లోబిన్ పెంచేందుకు కొన్నేళ్లపాటు తమ స్థాయిలో పంపిణీ చేస్తూ వచ్చింది.
రాగిజావ, బెల్లం పంపిణీతో కలుగుతున్న ప్రయోజనాలను గుర్తించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ట్రస్టు సభ్యులతో సమావేశమై కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని కోరింది. ఈ క్రమంలో ట్రస్టు సభ్యులు 2022-23 విద్యా సంవత్సరంలో 10 జిల్లాల్లో నాలుగు లక్షల మంది పిల్లలకు పంపిణీ చేశారు. ఇంటి వద్ద అన్నం, అల్పాహారం తీసుకోకుండా వచ్చిన చిన్నారులకు పాఠశాలలో ఇచ్చే రాగిజావ, బెల్లం ఉపయోగపడేది. ఆ కొద్దిరోజులకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులందరికీ వర్తింపజేయాలని సర్కారు నిర్ణయించింది.
అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలోనే చేపట్టాలని కోరింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో 20 లక్షల మందికి పైగా పిల్లలు అభ్యసిస్తున్నారని, వారందరికీ అందజేసే స్థోమత తమకు లేదని ట్రస్టు పేర్కొనడంతో ప్రభుత్వం-స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ పథకాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వం ప్రధాని పోషక అభియాన్ కింద వచ్చిన 18 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో 2023 విద్యాసంవత్సరం జూన్ నుంచి ఏప్రిల్ 2024 విద్యా సంవత్సరం చివరి దాకా పిల్లలకు రాగిజావ, బెల్లం ప్యాకెట్లను ట్రస్టు అందజేస్తూ వచ్చింది.
కొత్త సర్కారు మొండి చేయి
రాష్ట్రంలో ప్రభుత్వం మారడం బడిపిల్లల పాలిట శాపంగా మారింది. రాగిజావ, బెల్లం పంపిణీని అటకెక్కించింది. నిబంధనల ప్రకారం రాగిజావ, బెల్లం పంపిణీ కోసం ఏటా జనవరిలో ప్రభుత్వం నిధులను అంచనా వేసి, వాటికి అయ్యే మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. బడ్జెట్ ఆమోదం తర్వాత జూన్‌లో విద్యా సంవత్సరం మొదలైన తర్వాత నిధులను నెల వారీగా.. లేదంటే విడుతల వారీగా స్వచ్ఛంద సంస్థకు విడుదల చేస్తూ ఉండాలి.
నిధులు అందితేనే సత్యసాయి ట్రస్టు తమ వాటాను కలిపి రాగిజావ, బెల్లం పంపిణీని చేపడుతుంది. కానీ, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పథకం నీరుగారిపోయింది. ఈ యేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రయత్నించినా వీలు లేకుండా పోయింది. తర్వాత పలుసార్లు ప్రయత్నాలు చేసినా, కనీస స్పందన రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు.
2024 జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభం కాగా, నిధులు లేకపోవడంతో పథకాన్ని ఎలా కొనసాగించాలో తెలియక ట్రస్టు డైలామాలో పడిపోయింది. ప్రభుత్వం ఈ రోజు కాకపోతే రేపైనా స్పందిస్తుందన్న నమ్మకంతో తమ సొంత నిధులు వెచ్చించి జూన్, జూలైలో రాగిజావ, బెల్లం పంపిణీని యథావిధిగా అమలు చేసింది. కానీ, ప్రభుత్వం చేతులెత్తేయడంతో విధి లేని పరిస్థితిలో ఆగస్టు మొదటి వారం నుంచి పంపిణీని నిలిపివేసింది.
ఇబ్బందుల్లో పిల్లలు
గతేడాది అక్టోబర్‌లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సీఎం టిఫిన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి, లాంఛనంగా అమలు చేశారు. అయితే అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడం, కొత్త సర్కారు కొలువుదీరడంతో పథకం అటకెక్కింది. కాగా, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థ-ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తూ వచ్చిన రాగిజావ, బెల్లం పంపిణీకి సర్కారు ఎగమనామం పెట్టింది. ప్రభుత్వ చర్యతో రాగిజావ, బెల్లం పంపిణీ నిలిచిన ఉమ్మడి జిల్లాలోని లక్షలాది మంది పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒక్క జగిత్యాల జిల్లాలోనే 50వేల మందికిపైగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కాగా, ఈ విషయమై సత్యసాయి అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ సభ్యుడు మాట్లాడుతూ, తాము ఎంతగా ప్రయత్నించినా, ప్రభుత్వం స్పందించకపోవడం, సహకరించకపోవడంతోనే పథకాన్ని నిలిపివేసినట్టు చెప్పారు. కాగా, ఇప్పటికైనా స్పందించి పిల్లలకు రాగిజావ, బెల్లం అందజేసేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.