ఐటీఐలో ప్రవేశాల కోసం ప్రభుత్వం విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఐటీఐ శిక్షణ పొందితే అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండడంతో ఈ కోర్సుల్లో చేరేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నది. ఈ క్రమంలో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ నెల 28వ తేదీ వరకు అవకాశం కల్పించింది. అయితే, ఐటీఐ శిక్షణ పూర్తి చేసిన వారిలో సుమారు 85 శాతం మంది ఉపాధి పొందుతున్నట్లు తెలుస్తున్నది.
– కరీంనగర్ కమాన్చౌరస్తా, ఆగస్టు 18
కోర్సులు ఇలా..
ఒక సంవత్సరం కోర్సుల్లో డీజిల్ మెకానిక్, కంప్యూటర్, వెల్డర్, కోపా (కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ ఆనలిస్ట్), రెండు సంవత్సరాల కోర్సుల్లో డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్, మోటర్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, తదితర విభాగాలు ఉన్నాయి. అలాగే, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ కోర్సుల్లో మానిఫ్యాక్చరింగ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ ఆటోమేషన్ (ఏడాది), ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ డిజిటల్ మానిఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ (ఏడాది), బేసిక్ డిజైన్ అండ్ పర్చువల్ అనాలిసిస్, డిజైనర్(రెండేళ్లు), అడ్వాన్స్డ్ సీఎస్సీ మెకానిక్ టెక్నీషియన్ (రెండేళ్లు), మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్ (రెండేళ్లు) ఉన్నాయి.
దరఖాస్తు ఇలా..
ఆసక్తి ఉన్నవారు ఈ 28వతేదీ లోగా ఆన్లైన్లో (https:/iti.telangana.gov.in) దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఐటీఐలో చేరే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు ప్రతిపాదికన వెబ్ ఆప్షన్లు పెట్టి అన్ని ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, వెబ్ ఆప్షన్ల ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఉపయోగించే ఫోన్ నంబర్, ఈ-మెయిల్ కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగించాలి. అలా కాకుండా నేరుగా కళాశాలకు వెళ్లి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది.
సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో చేరేందుకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. విద్యార్థులు సెలవు రోజుల్లో కూడా ఈ నెల 28లోగా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలోని మొత్తం 412సీట్లకు గానూ ఇప్పటి వరకు 153సీట్లు భర్తీ అయ్యాయి. 259 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– కే అశోక్ కుమార్, ప్రిన్సిపాల్, ఐటీఐ కళాశాల (కరీంనగర్)